అనంతపురం ( జనస్వరం ) : పారిశుద్ధ మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పారిశుద్ధ కార్మికులు సమ్మెలో కి వెళ్లడంతో నగరంలోని ఏ వీధి మలుపు చూసినా చెత్త కుప్పలతో దర్శనమిస్తోంది. ఫలితంగా నగరం అంతా కంపు కొడుతోందని.. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు కొండలుగా పేరుకుపోతున్న చెత్త కుప్పలే నిదర్శనమని జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గం ఇన్చార్జి టిసి వరుణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు పేరుకుపోవడంతో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, శీతాకాలంలో సీజనల్ వ్యాధులు స్వైర వ్యవహారం చేస్తున్నాయని, వైరల్ జ్వరాలతో చిన్నపిల్లలు వృద్ధులు బాధపడుతున్నారని రోగాలు ప్రబులుతున్నాయని తెలిసిన ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేని మంత్రుల నామమాత్రపు చర్చలతో కార్మికులకు న్యాయం జరగడం లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కలగజేసుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, మెరుగైన పారిశుధ్యం కోసం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వరుణ్ హెచ్చరించారు.