విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి ఉపసంహరణ – శ్రీ పవన్ కల్యాణ్ గారు…
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రక్షణగా నిలిచే వ్యవస్థ ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జి.హెచ్.ఎం.సి.) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి… అందుకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుంది అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రకటించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జి.హెచ్.ఎం.సి. ఎన్నికల పోటీ నుంచి అభ్యర్థులను ఉపసంహరించుకొంటున్నట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో శ్రీ పవన్ కల్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారు సమావేశమై జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో కలసి పని చేయడంపై చర్చించారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఇంట్లో రెండు గంటలసేపు ఈ చర్చలు సాగాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “విశ్వ నగరంగా హైదరాబాద్ ఎదుగుతున్న క్రమంలో పటిష్టమైన నాయకత్వం చాలా అవసరం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు హైదరాబాద్ నగర ప్రజలకు అందాలి. విశాల దృక్పథం కలిగిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నగర అభివృద్ధిలో ఎంతో అండగా ఉంటుంది. కరోనా కష్ట కాలంలోనే భారీ వరదలు వచ్చాయి. నగర ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమయ్యిందో ప్రజలు చూసారు. బిహార్ ఎన్నికలలోను, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలను చూస్తే మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో తెలుస్తుంది.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీలు కలిసి చర్చించుకోవాలని భావించాయి. ఇంతలోనే షెడ్యూల్ వచ్చింది. ఇరు పార్టీల మధ్య పోటీ విషయంలో కొంత మేరకు గందరగోళం నెలకొంది. అయితే హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నాం. డా.లక్ష్మణ్ గారు, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గార్లతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వారిద్దరితో విస్తృత చర్చలు సాగించాం. విశాల ప్రజా ప్రయోజనాలను కాంక్షిస్తూ జి.హెచ్.ఎం.సి. ఎన్నికల వరకూ ఆగాలని నిర్ణయించాం. భవిషత్తులోనూ కలసి పని చేస్తాం.
2008 నుంచి నాతో కలసి పనిచేసిన క్యాడర్ ఉంది. అలాగే 2014 ఎన్నికల సమయంలోను, 2019 ఎన్నికల్లోనూ పార్టీ వెంట ఉన్న క్యాడర్ ఉంది. వారు జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. వారు కొంత మేరకు నిరుత్సాహానికి లోనవుతారు. అయితే విస్తృత ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఇది. విభజన రాజకీయాలు ఉండకూడదు. నగర ప్రజల శ్రేయస్సు, వారి రక్షణను దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన నాయకత్వం రావాలని కోరుకున్నాం. మతాలూ, ప్రాంతీయ విభజనలు ఆస్కారం లేని విధంగా ఆ వ్యవస్థ ఉండాలి. ఆ క్రమంలోనే జి.హెచ్.ఎం.సి. మేయర్ గా బీజేపీ అభ్యర్థిని గెలిపించేలా జనసేన పార్టీ మద్దతు తెలుపుతుంది. ఒక్క ఓటు కూడా బయటకు పోకూడదు. ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. డా.లక్ష్మణ్ గారు ప్రచార కమిటీ బాధ్యతలు చూస్తున్నారు. శ్రీ కిషన్ రెడ్డి గారికి ఎన్నో బాధ్యతలు ఉన్నా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఇరుపార్టీలు కలిసి పనిచేయడంపై సమన్వయంతో ముందుకు వెళ్తాం. మీరంతా మద్దతు తెలపండి. నేనూ ప్రచారంలో పాల్గొంటాను” అన్నారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జి.హెచ్.ఎం.సి. ఎన్నికల అంశంపై బీజేపీ కేంద్ర నాయకత్వం గత రెండు రోజులుగా చర్చిస్తోంది. అందుకు వారికి కృతఙ్ఞతలు. సీనియర్ నాయకులూ డా.లక్ష్మణ్ గారు, మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. భవిష్యత్ లో రెండు పార్టీలు కలిసి పని చేయడం గురించి ఒక కార్యాచరణ రూపొందిస్తాం.సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఒక రోడ్ మ్యాప్ ను తయారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాం. రాబోయే రోజుల్లో కలిసి పని చేసుకుందాం. భవిష్యత్తులోనూ ప్రజలకు మంచి నాయకత్వం, పాలన అందించే దిశగా ముందుకు వెళదాం” అన్నారు.
ఎంతో సహృదయంతో స్పందించారు: డా.లక్ష్మణ్ గారు :
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ గారు మాట్లాడుతూ “శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో బిహార్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ద్వారా తెలిసింది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో జనసేన మద్దతు కోసం బీజేపీ తెలంగాణ శాఖ వైపు నుంచి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారితో కలిసి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారితోను, పార్టీ పి.ఏ.సి. చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో ప్రత్యేకంగా చర్చించాం. ఎన్నికల్లో మద్దతుగా నిలిచి ఈ ప్రక్రియలో భాగం కావాలని కోరాం. ఈ నగరం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి. ప్రపంచ స్థాయి అభివృద్ధి శ్రీ మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ద్వారానే సాధ్యం. ఈ విషయాన్ని శ్రీ పవన్ కల్యాణ్ గారు కూడా విశ్వసిస్తున్నారు. మాకు మద్దతుగా నిలుస్తామని ఎంతో సహృదయంతో, పెద్ద మనసుతో స్పందించారు. వారికి మా కృతఙ్ఞతలు.నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ జనసేన క్యాడర్ ఉంది. రాజకీయంగా, సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉన్నారు. ఎన్నికలకు తక్కువ కాలవ్యవధి ఉండటంతో రెండు పార్టీలు కలిసి పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది. బీజేపీ గెలుపు కోసం జనసేన, జనసేన కార్యకర్తల మద్దతు అవసరం.. ప్రత్యేకంగా శ్రీ పవన్ కల్యాణ్ గారి ప్రచారం అవసరం. రాష్ట్ర నాయకత్వం, మేము ఆలోచన చేసాం. వారిని కలిసి విజ్ఞప్తి చేసాం. కరోనా కష్ట కాలంలో, వరదల సమయంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు, వారి కార్యకర్తలు ఎంతో స్వచ్చందంగా సేవలు అందించారు. వారికి ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ వైపు నుంచి, మా వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అన్నారు. శ్రీ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ “జీహెచ్ఎంసి ఎన్నికల్లో కలిసి పని చేసేందుకు సమావేశం అయ్యాం. బీజేపీకి పూర్తి మద్దతు ఇవ్వాలని కోరాం. వారు సానుకూలంగా ఆంగీకరించినందుకు ధన్యవాదాలు” అన్నారు.