గుంటూరు ( జనస్వరం ) : పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు తెస్తానంటూ ప్రతిపక్ష నేతగా నాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటే మరచిపోయాడని, నమ్మించి వంచించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కార్మికులు ఎప్పటికీ క్షమించరని కార్మిక సంఘ జే ఏ సీ సభ్యులు సోమి శంకరరావు అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారనికై ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు జే ఏ సీ పిలుపునిచ్చిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల , ఒప్పంద కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సోమవారం కార్మిక జేఏసీ, జనసేన, టీడీపీలు నగరపాలక సంస్థ ఎదుట పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ జగన్ రెడ్డి అవగాహనారాహిత్య , నిరంకుశ పాలనతో పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో అంధకారం నెలకొందని విమర్శించారు. కార్మికులు చేస్తున్న పనికి వారి కాళ్ళు మొక్కినా తక్కువే అంటూ జాలి , ఆప్యాయత ఒలకబోసిన జగన్ అధికారంలోకి రాగానే వారి సంక్షేమాన్ని గాలికొదిలేసారని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలకు లక్ష రూపాయలిచ్చినా తక్కువేనంటూ చెప్పిన జగన్ నాలుగున్నరేళ్లుగా కార్మికుల జీతాన్ని ఒక్క రూపాయి కూడా పెంచలేదని దుయ్యబట్టారు. వెలకట్టలేని కార్మికుల త్యాగాన్ని జగన్ చిన్న చూపు చూడటం సరైనది కాదని నేరేళ్ళ సురేష్ అన్నారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను మోసం చేసిన జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోనున్నారన్నారు. కార్మికుల కన్నీళ్లు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదన్నారు. సమానపనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత వంటి న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల , ఒప్పంద ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై టీడీపీ, జనసేన కార్మికుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని నసీర్ అహ్మద్ అన్నారు. కార్యక్రమంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, టీ యన్ టీ యు సీ నగర అధ్యక్షుడు నాగ గౌడ్ టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు, వీరమహిళలు పాల్గొన్నారు.