తిరుపతి ( జనస్వరం ) : రాష్ట్రంలో సాధికారత ఒకే సామాజిక వర్గానికే దక్కిందన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సామాజిక సాధికారత అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు సిఎం జగన్ సామాజిక వర్గానికే కేటాయించారన్నారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాల్లో 31 స్థానాలు ఒకే సామాజిక వర్గానికి కేటాయించారన్నారు. తిరుపతిలో కొండపైన, కొండ కింద జగన్ సామాజిక వర్గానికే చెందిన వారే కీలక పదవుల్లో ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా సింహ భాగం ఒకే సామాజిక వర్గానికి కేటాయించారన్నారు. తిరుపతిలో మేయర్ కి సరైన గౌరవం దక్కడం లేదన్నారు. కనీసం సభలు, సమావేశాల్లో కూడా మేయర్ కు మైక్ ఇవ్వడం లేదన్నారు. డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్నారు. డిప్యూటీ సిఎంగా ఉన్న నారాయణస్వామిని రబ్బర్ స్టాంప్ గా మార్చేశారన్నారు. పదవులు, అధికారాలు అన్నీ తన సామాజిక వర్గానికి కట్టబెట్టిన సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆజ్ఞతో ఆ పార్టీ నేతలు సామాజిక సాధికారత గురించి యాత్రను చేపట్టడం హాస్యాస్పదం అన్నారు. రాజకీయ పదవులు, రాజ్యాంగ పదవులు, నామినేటెడ్ పదవులు అన్నీ జగన్ తన సామాజిక వర్గానికే కట్టబెట్టాడని డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, బాబ్జి, ప్రధాన కార్యదర్శులు మునస్వామి, రుద్ర కిషోర్, నగర కార్యదర్శి కిరణ్ కుమార్, రవి,వీరమహిళ మధు లత జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.