తిరుపతి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లాలో పాలెగాళ్ల పాలనను అంతమొందిస్తామన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. బుధవారం ఆయన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యతో కలిసి స్ధానిక పిఎసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ అనుభవం కలిగిన గన్ అయితే… జనసేన పార్టీలోని యువత బుల్లెట్ లతో సమానమన్నారు. టిడిపి, జనసేన కలిసి రాక్షసులతో యుద్దం చేయబోతున్నాయన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు అరాచకాలు స్రుష్టిస్తున్నారన్నారు. మరీ ముఖ్యంగా పడమటి నియోజకవర్గాల్లో పాలెగాళ్ల పాలనను తలపిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యేనే జనాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ పాలనకు స్వస్తి పలికి ఆయన్ని సున్నాకే పరిమితం చేస్తామన్నారు. వైనాట్ 175 అని జగన్ అంటున్నారని, వాస్తవంగా వై నాట్ జీరో అనాలన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో టిడిపి జనసేన అభ్యర్ధులు విజయం సాధించబోతున్నారన్నారు. చివరకు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే పర్యటించేందుకు అడ్డుకున్నారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా పాలెగాళ్లతో నిండిన వైసీపీకి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. చివరకు మహిళలు మీడియా సమావేశం నిర్వహిస్తే వారిపై హత్యాయత్నం కేసులు పెట్టాడం దారుణమన్నారు. రాష్ట్రంలో ప్రతి పక్ష నేతలకు ఐసీపీ సెక్షన్ 307 డిగ్రీలను ఇస్తున్నారని వ్యంగ్యోక్తులు విసిరారు. అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన జనసేన టిడిపి సమన్వయ సమావేశంలో మంచి స్నేహపూరిత వాతావరణం నెలకొందన్నారు. టిడిపి ధీటుగా జనసేన నాయకత్వం ఉందని టిడిపి నాయకులు వ్యాఖ్యానించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టిడిపి జనసేన ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడం చాలా మంచి పరిణామమన్నారు. రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించినా వారిపై హత్యాయత్నం చేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.