గుంటూరు ( జనస్వరం ) : లక్షమందికి పైగా పాల్గొన్న అవనిగడ్డ బహిరంగ సభలో మంత్రి అంబటి రాంబాబుకు జనాలు కనపడకపోవటం విచిత్రంగా ఉందని, కళ్ళకు ఏమన్నా చత్వారం వచ్చిందేమో ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిదని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. వారాహి విజయయాత్ర జనాలు లేక ప్లాప్ అయిందంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించటంపై ఆయన సోమవారం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభకు జనాలు రాకుండా ఉండటానికి, సభ మధ్యలో బారికేడ్లు, గోడలు దూకి పారిపోవటానికి అది జగన్ రెడ్డి సభ కాదన్నారు. అవనిగడ్డలో సభకు వచ్చింది మీరు అదిరించి బెదిరించి తరలించిన డ్వాక్రా, అంగన్ వాడీ మహిళలు, వాలంటీర్లు కాదని పవన్ కల్యాణ్ నిబద్ధత, నిజాయితీ, సమాజం పట్ల ఆయనకున్న ప్రేమపై నమ్మకంతో తరలివచ్చిన వాళ్ళని అన్నారు. వారాహి సభకు జనాలు రాకుండా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా , అవనిగడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులతో నాగాబందీ ఏర్పాటు చేసి జనసైనికుల్ని అడ్డుకున్నా సభ విజయవంతం అవటంతో వైసీపీ నేతలు విషప్రచారానికి దిగారని దుయ్యబట్టారు. సభాస్థలిలో ఎంతమంది ఉన్నారో అంతకు మించి బయట జనసైనికులు , వీరమహిళలు ఉన్నారని, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోవచ్చన్నారు.
టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతలకు కౌంట్ డౌన్ మొదలైందని, కళ్ళముందు ఓటమి కదలాదుతుండటంతో వారికి మతిభ్రమించిందన్నారు. పొత్తు విచ్ఛిన్నం చేయటానికి వైసీపీ నేతలు చేస్తున్న కుటిల యత్నాలు ఫలించవన్నారు. సభలో టీడీపీ శ్రేణులు పాల్గొనటం వారికి జనసైనికులు స్వాగతం పలకటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలపై, పాలసీల్లో ఉన్న లోపాలపై, మెగా డీయస్సి ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం చేసిన విధానంపై, విద్యార్థులు చదువుకు దూరం అవ్వటంపై, చిన్నారులు అధిక సంఖ్యలో చనిపోవటంపై, మద్యనిషేధంపై ఒక్క వైసీపీ నేత కూడా సమాధానం ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు. వైసీపీ నేతల అవినీతిపై అక్రమాలపై మాట్లాడితే వ్యక్తిగత విమర్శలకు దిగుతారని, పాలసీలపై, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే పవన్ కల్యాణ్ తమని తిట్టడం లేదని వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు బాధపడుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ పై మాటల దాడిని ఆపించి, అవనిగడ్డ సభ తరువాత ఎర్రగడ్డకు క్యూ కడుతున్న వైసీపీ నేతల్ని జగన్ రెడ్డి కాపాడుకోవాలని హితవు పలికారు. రానున్నది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని, అధికార మదంతో విర్రవీగుతున్న వైసీపీ నేతలకు 2024 ఎన్నికల తరువాత శంకరగిరి మాన్యాలు తప్పవని ఆళ్ళ హరి హెచ్చరించారు.