ఎస్కేయూ, సెప్టెంబర్ 29 ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఎస్కేయూ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ గిడ్డి వెంకటరమణ (ప్రొ. జి.వి. రమణ) ను శుక్రవారం పలువురు ఆత్మీయంగా సత్కరించారు. నల్లాని రాజేశ్వరి ఫౌండేషన్ సి.ఈ.ఓ. గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, బిసిఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది సాకే నరేష్ తదితరులు దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జి.వి. రమణ సేవలను వారు కొనియాడారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సమాజశాస్త్ర విభాగం అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా విశేషకృషి చేస్తున్నారని చెప్పారు. పదిమందికి పైగా ఎం.ఫిల్., పిహెచ్.డీ. విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారని తెలిపారు. విషయనిపుణుడిగా దాదాపు 25 పుస్తకాలను ప్రచురించారని, యాభైకి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనాపత్రాలను సమర్పించారని చెప్పారు. పలు పత్రికల్లో సామాజిక చైతన్య వ్యాదాలు రాయడంతో పాటు, ఆకాశవాణి, టి.వి. ఛానళ్లు, అనేక సభల్లో ప్రసంగాలు చేశారని వివరించారు. గతంలో ప్రవేశాల సంయుక్త సంచాలకులుగా, విద్యార్థులు, ప్రజావ్యవహారాల డీన్ గా, జాతీయ సేవాపథకం కార్యక్రమ సమన్వయకర్తగా తనదైన శైలిలో సేవలందించారని ప్రశంసించారు. దూరవిద్యా విభాగం ఉప సంచాలకులుగా, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కీలకపాత్ర పోషించారన్నారు. ప్రస్తుతం పరీక్షల విభాగం డీన్ గా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటుచేసిన పలు కమిటీలలో చురుగ్గా పనిచేస్తున్నారని వివరించారు.