గుంటూరు ( జనస్వరం ) : గుంటూరు జీటీ రోడ్డు దశరథరామయ్య పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న డివైడర్ ని గురువారం ఆర్ టీ సీ బస్సు ఢీ కొట్టింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డు గుంతలమయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు పాలకులకు, అధికారులకు చెప్పుకున్నా చెవిటోడి ముందు శంఖం ఊదిన చందమే కానీ రోడ్డుకి మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. వందల కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశాం అని గొప్పలు చెప్పుకునే నేతలకు, అధికారులకు తీవ్రస్థాయిలో దెబ్బతిన్న ఈ రోడ్డు కనపడకపోవటం శోచనీయం. పైగా ఇదే రోడ్డుపై శాసనసభ్యులు, కమీషనర్, మేయర్, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు కూడా నిత్యం ఇలా గతుకులమయంగా మారిన రోడ్డుపైనే ప్రయాణిస్తుంటారు. అయినా కానీ ఈ రోడ్డుకి మాత్రం శాశ్వత పరిష్కారం చూపుదామన్న కనీస ఆలోచన చేయకపోవటం సిగ్గుచేటు. ఇంకెన్ని ప్రమాదాలు జరిగితే పాలకులు, అధికారులు కళ్ళు తెరుస్తారో చూడాలి. ఏదన్నా జరగరాని ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే కానీ స్పందించరేమో?