జగ్గంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం 646వ రోజు కార్యక్రమంలో భాగంగా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో పర్యటించారు. నియోజకవర్గం ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలోనీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ జనం కోసం జనసేన అనే మహాయజ్ఞం ద్వారా ఇప్పటికే చాలా ప్రజా సమస్యలకు పరిష్కారం చేసి నియోజకవర్గంలోని నిరు పేదలకు సహాయం చేశాం అని అన్నారు. ఈ నేపథ్యంలో మల్లవరం గ్రామంలో ఒక నిరు పేద మహిళ అయిన గుంటి జ్యోతి తన భర్త చనిపోయి ఒక సంవత్సరం దాటుతున్నా కానీ ఆమెకు వితంతు పింఛను ఇంకా రావడం లేదనీ అన్నారు. ఇలా ఎందుకు రావడం లేదని ఆరా తీయగా ఆమె అత్తగారు అయిన గుంటీ నాగభూషణం గారు కూడా భర్త చనిపోయి వితంతు పింఛను తీసుకుంటున్నారని వీళ్లిద్దరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉండడం వలన ఒక రేషన్ కార్డుకు ఒకే పింఛను అని చెప్పడం వలన అర్హులైన నిరు పేదలకు కూడా పింఛను అందడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి అడ్డగోలు షరుతులు పెట్టకుండా అర్హులైన పేదలను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.