న్యూస్ ( జనస్వరం ) : షెడ్యూల్ ప్రకారం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం గన్నవరం విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గన్నవరం విమానాశ్రయ అధికారులకు లేఖ రాశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తుందని, ఆయన విమానం దిగేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులు ఈ సమాచారాన్ని బేగంపేట విమనాశ్రయానికి చేరవేయడంతో పవన్ కళ్యాణ్ విమానాశ్రయానికి వచ్చినప్పటికీ అక్కడ నుండి విమానం టేకాఫ్ అయ్యేందుకు అధికారులు అనువుతినివ్వలేదు. దీంతో పవన్ కళ్యాణ్ వెనుదిరిగారు. అయితే రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను తొలుత గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలువరించారు. కానీ జనసైనికులు పెద్దఎత్తున తరలి రావడంతో పోలీసులు పవన్ వాహనాన్ని ముందుకు వదిలారు. అయితే అనుగంచిపల్లి వద్ద మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేనాని కారు దిగి కాలినడకన బయలుదేరారు. కానీ పోలీసులు ఆయన్ని ముందుకు కదలనీయలేదు. దీంతో పవన్ కళ్యాణ్ నిరసనగా రోడ్డుపైనే పవళించారు. అర్ధరాతి దాటిన తర్వాత కూడా ఆందోళన కొనసాగింది. అడుగడునా జనసైనికులు నిరసన వ్యక్తం చేయగా, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. కళ్యాణ్ గారి కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో పోలీసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, పిఏసి చైర్మైన్ నాదెండ్ల మనోహర్ ను మరో పోలీసు వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాత్రి ఇంచుమించుగా 3 గ౦. లకు మంగళగిరి పార్టీ ఆఫీసుకు వద్దకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తారని మేమేమీ ముందుగా ఊహించలేదు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం మేము రేపు ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నాం. నన్ను ఆపితే పోలీసులకి ఒకటే చెప్పా.. బెయిల్ మీద ఈ ముఖ్యమంత్రి బయట ఉన్నాడు. ఎంత సేపూ ఆ ముఖ్యమంత్రి జైలు గురించి ఆలోచిస్తాడు. అందర్నీ జైలుకి పంపాలనే ఆలోచిస్తాడు. అతనో క్రిమినల్. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి తీసుకోవాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉంది అది దురదృష్టం. బెయిల్ మీద బయటకెళ్లే వాడికి ఎంతసేపూ అరెస్టులు చేయాలనే ఆలోచనలే ఉన్నాయి. తను క్రిమినల్ అయితే అందరూ క్రిమినల్స్ అవ్వాలని కోరుకుంటాడు. అదీ సమస్య చంద్రబాబు నాయుడి గారిని కలుస్తానని ఎలా ఊహిస్తారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి ఎవరు అనుమతిస్తారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం వీసా కావాలి అంటుందేమో?. కారణాలు చెప్పడం లేదు. రాకూడదు అంటున్నారు. రౌడీలు, గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది ట్రాఫిక్ అగిపోయింది. ఫ్లయిట్ లో వెళ్తానంటే ఎక్కనివ్వలేదు. కారులో వెళ్తామంటే అనుమతివ్వడం లేదు. నడిచి వెళ్తామన్నా అనుమతి ఇవ్వడం లేదు. విశాఖలో కూడా ఇలాగే చేశారు. ఏం చేయాలి… గూండాలు, దోపిడి చేసే వారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. అది అందరికీ అర్ధం అవుతోంది. ఒకపక్క జాతీయ స్థాయిలో జీ 20 సమ్మిట్ జరుగుతోంది, దేశానికి చాలా ప్రతిష్టాత్మక సమ్మిట్ జరుగుతోంది. జీ20 దేశాల ప్రతినిధులు వస్తున్నప్పుడు ఇలాంటి పని చేయడం ప్రధాన మంత్రిగారి స్ఫూర్తికి మచ్చ. ప్రధాన మంత్రి గారు చాలా కష్టపడి తీసుకువస్తే అన్ని రాష్ట్రాలు సహకరించాలి. దురదృష్టం ఏమిటంటే గూండాలకి అధికారం ఇస్తే జీ 20 తాలూకు విశిష్టత వారికి ఏమర్ధమవుతుంది, పోలీసులు కో ఆపరేట్ చేయమని ఆపేశారు తప్ప ఏమీ చెప్పలేదు చాలా మంది బాధ పడుతున్నారని మీడియా ముఖంగా ప్రస్తావించారు.