గుంటూరు ( జనస్వరం ) : ఎంతో నమ్మకంతో తనను గెలిపించిన ప్రజలను , నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి మాటల గారడీతో కాలం వెళ్లబుచుతున్న జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర రాజకీయాల్లోనే చరిత్ర హీనుడిగా మిగిలిపోనున్నారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలు తప్ప చేతలు లేని అసమర్ధ మంత్రి అంబటి రాంబాబు అంటూ ధ్వజమెత్తారు. తాము ప్రజాప్రతినిధులమని ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంగతిని మరచిన అంబటి రాంబాబు లాంటి నేతలు రాష్ట్రానికి పట్టిన చీడపురుగులని విమర్శించారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా తన సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో చెప్పుకోవటానికి కూడా ఏమీ లేని విధంగా పరిపాలన చేయటం అంబటికే చెల్లిందన్నారు. నకరికల్లు మండల కేంద్రంలో నడవటానికి కూడా వీలులేని దుస్థితిలో ఉన్న రోడ్డుని కూడా నిర్మించలేని దుస్థితిలో అంబటి రాంబాబు పనితీరు ఉందని దుయ్యబట్టారు. తమ సమస్యలు చెప్పుకుందామంటే మంత్రి అంబటి అందుబాటులో ఉండటంలేదని, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదని ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. గత ఎన్నికల్లో అంబటి పలికిన చిలక పలుకులు విని మోసపోయామని, అతని మాటల్లోని మయామర్మాన్ని గ్రహించలేకపోయామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కమీషన్లు, లంచాలు, భూకబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజాధనాన్ని దోచుకోవటంలోనే అంబటికి సమయం చాలటం లేదని ఇక ప్రజల గురించి ఏమి పట్టించుకుంటారంటూ విమర్శించారు. ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన అంబటికి తన ఓటమి కళ్ళముందు కదలాడుతుండటంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాధరణ పొందాలి అంటే పవన్ కళ్యాణ్ ని తిట్టడం కాదని ప్రజలకి సేవ చేయాలని హితవు పలికారు. సత్తెనపల్లి ప్రజలకు గుండెలపై కుంపటిలా తయారైన అంబటిని సత్తెనపల్లి నుంచి తరిమేసేందుకు ప్రజలు సమాయత్తమయారన్నారు. రానున్న ఎన్నికల్లో అంబటి కనుక నుంచుంటే తాము గతంలో ఆయన్ని గెలిపించి చేసిన పాపాన్ని కడిగేసుకుంటామని, డిపాజిట్లు కూడా దక్కకుండా చేసి పాపప్రక్షాళన చేసుకోవటానికి సత్తెనపల్లి ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆళ్ళ హరి అన్నారు.