పార్వతీపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన కంప్లైంట్ పై కేసులు కట్టాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బాబు పాలూరుతోపాటు జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, గార గౌరీ శంకర్, ఖాతా విశ్వేశ్వరరావు, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, బంకురు రమేష్, శంకర్రావు, పవన్ , సీమల సతిష్ తదితరులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను కలిసి ఇటీవల బలిజిపేట మండలం బల్లి గ్రామంలో చోటుచేసుకున్న వైసీపీ, జనసేన పార్టీ నాయకులు మధ్య జరిగిన గొడవపై చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలో వైసీపీ వాళ్లు ఇచ్చిన కంప్లైంట్ పై జనసేన పార్టీ నాయకులు పై కేసులు నమోదు చేశారని, అదే జనసేన పార్టీ నాయకులు వైసిపి వాళ్ళు పై ఇచ్చిన కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు మధ్య జరిగిన గొడవలో కేవలం అధికార పార్టీ ఇచ్చిన కంప్లైంట్ పై కేసులు నమోదు చేస్తున్నారని జనసేన పార్టీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ పై కేసులు నమోదు చేయడం లేదని అన్నారు. అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తుంటే జనసేన పార్టీ నాయకులు, జన సైనికులపై పోలీసు భూతాన్ని చూపి భయపెడుతున్నారన్నారు. అలాగే చదువుకున్న వారిని కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కొంకిడివరం తగాదాను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే పార్వతీపురం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ భర్త జన సైనికుడు వంగల దాలి నాయుడు సెల్ఫోన్ నేలకు కొట్టి బూతులు తిట్టిన సందర్భంలో ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు కనీసం పట్టించుకోలేదని, కనీసం ఆయన్ని స్టేషన్కు పిలిపించే ధైర్యం చేయలేదన్నారు. కొంతమంది పోలీసు అధికారులు, సిబ్బంది అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని జిల్లాలో ఆ పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే దాడులకు ఎగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఇకపై సమస్యలు అడిగేటప్పుడు ఒకరు వీడియో తీయాలని సూచించారు .ఈ విషయమై బాబు పాలూరు మాట్లాడుతూ వీడియోలు తీస్తుంటే స్వయంగా MLAలే పోలీసుల సమక్షంలో మా జనసైనికుల దగ్గర నుంచి సెల్ ఫోన్లు లాక్కోవడం చాలా అప్రజాస్వామికంగా ఉందని చెప్పారు. ఇకపై అధికార పార్టీ నాయకులు ఆగడాలకు చెక్ చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా వారు ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.