నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 315వ రోజున 9వ డివిజన్ నవాబుపేట నజీర్ తోట రంగనాథనగర్ లో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళిన కేతంరెడ్డి ప్రజా సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలకు పైగా గడచిందని, గత విద్యాసంవత్సరానికి సంబంధించి సీఎం జగన్ హామీ ఇచ్చిన అమ్మఒడి నగదు జమకి ఆయన బటన్ నొక్కి నాలుగు రోజులు గడుస్తున్నా నగరంలో అనేకమంది తల్లుల ఖాతాల్లో ఇంకా ఆ నగదు జమ కాలేదని, ఈ సీఎం జగన్ రెడ్డి గారి బటన్ ని రిపేర్ చేసే రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఏ ఏడాదికి ఆ ఏడాది15వేల రూపాయల నగదు వేస్తామనే హామీ కాస్తా మరుసటి ఏడాదికి వేసేలా మారిందని, 15వేలు కాస్తా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, సదుపాయాల పేరుతో 13వేలుగా మారిందని, మరి ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2వేలు ఎందుకు కోత వేసారంటే ఈ ప్రభుత్వం వద్ద సమాధానం లేదని దుయ్యబట్టారు. 5 సంవత్సరాల తమ ప్రభుత్వంలో ప్రతి ఏడాది ఇస్తామన్న ఈ పథకం ఇప్పటికి 3 సార్లు మాత్రమే అమలు అయిందని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇక ఇదే చివరి అమ్మఒడి అని అన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం ఏర్పాటు కానున్న పవనన్న ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్ద పీట వేసి ఫిన్ ల్యాండ్ తరహా విద్యావిధానాన్ని అమలుపరుస్తామని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలను అత్యాధునిక సదుపాయాలతో ఆధునీకరించి ప్రతి సంస్థలో అత్యుత్తమ టీచర్లను పెట్టి ఉచితంగా బోధన సాగిస్తామని, ప్రజలు ప్రైవేట్ విద్యాసంస్థలను మరచిపోయేలా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాగానే ప్రణాళికలు ఉంటాయని కేతంరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.