పాడేరు ( జనస్వరం ) : నిరుపయోగంగా ఉన్న పాడేరు రైతు బజార్ జిల్లా ప్రధాన కూడలిలో ఆనుకుని ఉన్న రైతు బజార్ గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నది. దీంతో ఈ రైతు బజార్ రాత్రిళ్ళు అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు స్వర్గధామంగా మారిపోయింది. బహీర్భూమి ప్రదేశంగా మారిపోతుంది. గత ప్రభుత్వం ఎంతో కొంత ఆదివాసీ రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి సరైన మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ఆసక్తి కనబరచకపోవడంతో మరుగున పడిపోయింది. మన సంపద సృష్టి కేంద్రం మనం గుర్తించలేకపోవడం నిజంగా అసమర్థతే అవుతుంది. గత కొన్ని రోజులుగా పాడేరు నగర రోడ్డు విస్తీర్ణత పెంపుదలలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న దుకాణాలు తొలగించడం జరిగింది. ఉపాధి కోల్పోయిన గిరిజనప్రజలు వున్నారు. గిరిజనేతర ప్రజలు వున్నారు. ప్రజాప్రతినిదులు ఈ విషయంపై దృష్టి సారించి ఒక సహేతుకమైన ఆలోచన చేసి వారికి అక్కడ స్థానం కల్పిస్తే తమ వ్యాపారాలు తాము చేసుకుంటూ జీవనభృతి పొందుతారు. ప్రతి శుక్రవారం జరిగే సంత రద్దీ నుంచి కాస్త వెసులుబాటు దొరుకుతుంది. ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుంది. ప్రభుత్వం కల్పించుకుని ఈ ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే గిరిజన జాతి విలువైన స్థల సంపద డంపింగ్ యార్డ్ గా మారిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. పాడేరు నగర పరిపాలకులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే చాలు ఉపాధి మార్గం కోల్పోయిన కొంతమందికైనా ఉపశమనం కలుగుతుంది. ఇది వాస్తవికతతో ఆలోచించాల్సిన విషయం ఈ అంశంలో ఎటువంటి రాజకీయాలకు తావులేదు సంపద సృష్టి కేంద్రాలను గుర్తించడంలో ప్రభుత్వ ప్రతినిధులు ముందుచూపుతో వ్యవహరించాలి. ఇప్పటికే ఏటా శరదృతువు కాలంలో గిరిజనులు పండించే సీతమ్మ కాటుకలు అనే బంతి పూల వ్యాపారం లక్షల్లో టర్నోవర్ జరుగుతుంది. కాల క్రమేణా మార్కెట్ యార్డ్ సరైన నిర్వహణలేమి, లోపాలు కారణంగా మరుగున పడిపోయింది. శీతాకాలం సమయంలో తెల్లవార్లు 3 గంటల నుంచి వ్యాపార లావాదేవీలు ప్రారంభమవుతాయి. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తే శోభాయమానంగా కనిపిస్తుంది. సహజ పర్యాటక ప్రదేశం కనుక సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. లేదనుకుంటే గిరిజన చేతివృత్తి ఉత్పత్తుల కార్మికులను సమీకరించి వారికి సరైన ప్రోత్సాహమిస్తే ఆర్ధిక స్వాలంబన దిశగా గిరిజనులకు మంచి జరుగుతుంది. మరీ మన ప్రజాప్రతినిదులు ఈ సృజనాత్మక సంపద సృష్టిపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గ జనసేన నాయకులు తెలిపారు.