నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలు, కూడళ్ళలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని కోరుతూ నేడు జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు మునిసిపల్ కార్యాలయంకి చేరుకొని మునిసిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ పలు ప్రాంతాలు, కూడళ్ళలో “పేదలకు, పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం” అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక జంబో రాక్షసుని అవతారంలో ఉండే విధంగా పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ రాక్షసుడు తినేస్తాడు అనే అర్థం వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆ రాక్షసుడే కాదు కదా, ఏ రాక్షసుడు కూడా ఏమీ చేయలేడని తెలియజేస్తున్నామన్నారు. పైపెచ్చు ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే తుగ్లక్ పనులు సమాజంలోని పలు వర్గాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం కల్గించే అంశంగా మారే అవకాశం ఉందని అన్నారు. మునిసిపల్ అధికారులు అధికార పార్టీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తక్షణం తొలగించక పోతే అది ప్రభుత్వ వైఫల్యం గానో, లేదా ఇటువంటి తరహా ఫ్లెక్సీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందని భావిస్తూ, నెల్లూరు నగరంలో సీఎం జగన్ గారి రాక్షస రూప ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన అదే ప్రాంతాల్లో, అదే కూడళ్ళలో తమ జనసైనికులు కూడా తమ ఆలోచనాధోరణి పరంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారని అన్నారు. కేతంరెడ్డి వినతికి స్పందించిన మునిసిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ టౌన్ ప్లానింగ్ అధికారులను పిలిపించి తక్షణం ఆ ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో వారికి జనసేన శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరి రవి, కారంపూడి కృష్ణారెడ్డి, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, అమంచర్ల శ్రీకాంత్, హేమంత్ రాయల్, కార్తిక్, జీవన్, జాఫర్, వరప్రసాద్, వినయ్, వెంకటేశ్వరులు, సురేష్, ప్రసాద్, సమీర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.