నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 256వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం అంబేద్కర్ కాలనీ గణపతి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ప్రక్కదారి పట్టాయని అన్నారు. ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, ఇళ్ళ నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన చేయాల్సి ఉండగా నిధులు ఏమైయ్యాయో చెప్పలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 10 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఆ రుణాలను ఇచ్చిన దాఖలాలే లేవని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల డబ్బును కార్పొరేషన్ నిధులు, సబ్ ప్లాన్ నిధుల్లో చూపిస్తూ ఎస్సీ ఎస్టీలను ఘోరంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో మౌళిక వసతుల కల్పన సక్రమంగా జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావలసిందే అని అన్నారు. పవనన్న ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా 10 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలను అర్హులందరికీ క్రమం తప్పకుండా ఏ ఏటికాయేడు అందిస్తామని అన్నారు. ప్రతిభ కల్గి పది మందికి ఉపాధి చూపగల ప్రాజెక్టును రూపొందించే యువతకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా పవనన్న ప్రభుత్వంలో తలా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.