• పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 247వ రోజున 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ పల్లెపాలెం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో పవనన్న రథం వారాహి పై పర్యటనకు రానున్న పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడానికే వైసీపీ ప్రభుత్వం జీవో నెం 1 పేరుతో ఆపసోపాలు పడుతోందని అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకు జీవో అమలును నిలుపుదల చేసి ప్రభుత్వ వాదనను వినిపించాలని చెప్తే ప్రభుత్వం ఆగమేఘాల మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం చేత కూడా చీవాట్లు తింటేనే ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో అని అన్నారు. చీకటి జీవో ని తెచ్చిన రెండు మూడు రోజుల్లోనే రాష్ట్రంలో ఏమి జరిగిందో అందరూ చూశారని, అధికార వైసీపీ నాయకులు ఇష్టప్రకారం బహిరంగ విన్యాసాలు వేశారని, ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలకు పోలీసులు, అధికార యంత్రాంగం పూనుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచేలా ఉన్నటువంటి ఈ జీవో ని సుప్రీంకోర్టు ఏరకంగా సమర్ధిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. వందలాది సలహాదారులలో ఏ సలహాదారుని ఆలోచనో ఇది అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ ని అడ్డుకోలేరని, అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు చూస్తారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.