
– పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 235వ రోజున 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ రాయపాలెం సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సాయంత్రం ఆరు కాగానే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని అన్నారు. నగరంలో దోమల నివరణా చర్యలకు వైసీపీ ప్రభుత్వం ఏనాడో చరమగీతం పాడేసిందని అన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ కి చెందిన ఫాగింగ్ మిషన్లు వాడుక లేక శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. మురికి కాలువల్లో దోమలు ఉత్పత్తి కాకుండా ఆయిల్ బాల్స్ వేయడం లాంటి చర్యలు ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన దాఖలాలు లేవన్నారు. దోమల బెడద ఎక్కువై ఇంటింటికో పేషంట్ తయారవుతున్నారని అన్నారు. డెంగ్యూ వంటి జ్వరాలకు నెల్లూరు నగరాన్ని ఆవాసంగా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని దుయ్యబట్టారు. ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేని దీన స్థితికి వైసీపీ ప్రభుత్వం చేరుకుందని, అందుకే ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలందరి ఆశీస్సులతో నెల్లూరు నగరంలో గెలిచి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.