Search
Close this search box.
Search
Close this search box.

బలవంతపు తరలింపుతో బాధలెన్నో!

• అదిరించి బెదిరించి అధికారపార్టీ దందా

• వంతపాడుతున్న కొందరు అధికారులు

• డ్వాక్రా మహిళలకు తప్పని పాట్లు

      జగన్మోహనుని ‘జన సమీకరణ’ తీరే వేరు! ఆయన, మంత్రులు, శాసనసభ్యులు ప్రసంగాలు దంచే సభలకు జనాలను తరలించే ఆ రూటే సెపరేటు!! మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలు ఆ సభలంటేనే గడగడలాడుతున్నారు. ‘మేం రాలేం, వచ్చినా అక్కడ ఉండలేం, ఉన్నా ఆ రొద వినలేం’ అంటూ నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. ‘మేం రానేరాం అని చెప్తున్నా, మాకు ఆ సభలూ సొదలూ వద్దని మొత్తుకుంటున్నా, మెడమీద పదునైన కత్తి పెట్టినట్లు ఏమిటీ ఒత్తిడి?’ అంటూ నిరసన ధ్వనులు వినిపిస్తూనే ఉన్నారు. అయినా పట్టిన పట్టు వీడని విక్రమూర్ఖుల్లా పాలకులు ‘మీరు రావాలి, వచ్చితీరాలి‘ అని బలవంతపు తరలింపులకు సిద్ధమవడమే విడ్డూరం. జగన్ పాలనా… మజాకా అనేలా రాష్ట్రమంతటా పరిస్థితి ఇలా తయారయింది. నిర్బంధకాండకు గురవుతున్న లక్షలాది గ్రామీణ స్త్రీలు ఇప్పుడు ఆందోళన, నిరసన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

• అసలు లక్ష్యాలు ఇవీ….

      పల్లె ప్రాంతాల వనితలు, పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిందే డ్వాక్రా (డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్). ఇది సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకానికి / కార్యక్రమానికి సంబంధించింది. మహిళలందరినీ బృందాలుగా రూపొందించి, అనేక కుటీర పరిశ్రమలకు అవసరమయ్యే శిక్షణనివ్వడం దీని లక్ష్యం. దీంతో వారి కాళ్ల మీద వారు నిలబడి స్వావలంబన సాధిస్తారన్నదే ఆశయం. ఇది ఇప్పటిది కాదు. ఎప్పుడో 1982లో మొదలైంది. అంటే నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన వ్యవస్థ. జీవన స్థితిగతుల మెరుగుదల, స్వయం ఉపాధి కల్పనతో పురోభివృద్ధికి బాట వేయడం కీలక ధ్యేయాలు. అటువంటి సంస్థాగత శక్తిని పూర్తిగా దుర్వినియోగం చేసింది వైకాపా. మొత్తాన్నీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతూ వస్తోంది. ఏపీలో డ్వాక్రా అంటే… కోటి మంది సభ్యులున్న మానవ సంపద. గ్రామసీమల్లోని వీరంతా పొదుపు చేసేది ఎంత ఉంటుందో తెలుసా ? ఏటా రూ. 8 వేల కోట్లకు పైమాటే. చిన్నపాటి పరిశ్రమల ఏర్పాటుకు బ్యా౦కుల నుంచి తీసుకున్న రుణాలు రూ. 20 వేల కోట్లకు మించి ఉంటాయి. అప్పులకు సంబంధించి రికవరీలూ 98 శాతానికి పైన ఉన్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం – గ్రామీణ, పట్టణ పరిధుల్లో 11 లక్షలకు పైగా డ్వాక్రా సంఘాలున్నాయి. చేయూత, అసరా వంటి పథకాల ద్వారా వనితల ప్రగతికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. వడ్డీ భారాన్ని తగ్గించడం, విడతల వారీగా ఆర్ధిక సాయం అందించడం కూడా కర్తవ్యాలే. ఇటువంటి విధినిర్వహణల మాట అటుంచి, సర్కారు మార్కు సభలూ ఇతర కార్యక్రమాలకు డ్వాక్రా మహిళలను తరలించండం పైనే దృష్టి మళ్లింది. ఉచితంగా అంతా ఇస్తున్నామని తెగ ప్రచారాలు చేసుకుంటున్న జగన్ ప్రభుత్వం వారంతా ఉచితంగానే తరలివచ్చేవారు అనేలా వ్యవస్థ సమస్తాన్నీ భ్రష్టుపట్టించింది.

• అదిలింపులూ బెదిరింపులూ :

      పాలకుల మాటలూ చేతలను నమ్మని ప్రజలు పలు అధికారదర్ప సభలకు రావడం మానేశారు. ఘనత వహించిన నాయకులు కన్నెర్ర చేస్తారని జంకే దిగువ శ్రేణి వాళ్లు ఏదో విధంగా సభ నిండుగా కనిపించాలని నానారకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. వాటిల్లో భాగంగానే, నయానో భయానో గ్రామీణ మహిళలను ప్రధానంగా డ్వాక్రావారిని తరలించేస్తున్నారు. ‘ మీకు ఊళ్లో ఎన్ని పనులున్నా సరే, సభలకు మాత్రం చచ్చినట్లు వచ్చితీరాల్సిందే! రాకపోతే, మా తడాఖా చూపిస్తాం. ఒక్క ప్రభుత్వ పథకం కూడా అందకుండా చేస్తాం’ అని పదేపదే అదేపనిగా వెంటపడుతున్నారు. బెదిరిస్తున్నారు. ఆ అదిలింపులు, హుంకరింపులు ఎంత విపరీతమయ్యాయంటే.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల సభలంటేనే మహిళలందరూ విసిగి వేసారుతున్నారు. కొందరు అధికారులు సైతం వంతపాడటంతో మరింత బెంబేలెత్తి పోతున్నారు. బాధితులైన వారిలో చాలామంది చివరికి ఓర్పు నశించి, సభ మధ్యలోనే తిరిగి ఇంటిదారి పడుతున్నారు. ఒక్క సభలూ సమావేశాలనే కాదు; అధికార పక్షం జరిపే ర్యాలీలు, గర్జనలు, పార్టీ సంబంధ కార్యక్రమాలూ డ్వాక్రా వారికి పీడగా దాపురించాయి. ప్రభుత్వ సదస్సులైతే అధికార గణాలు, పార్టీ వ్యవహారాలైతే ప్రాంతీయ నాయక శ్రేణులు రెచ్చిపోతున్నాయి. గ్రామాలవారీగా ప్రతిచోటా డ్వాక్రా మహిళలుండటంతో, వారినే లక్ష్యం చేసుకొని తరలింపులు కొనసాగిస్తున్నాయి. చెప్పిన పని చేయకుంటే…. ఏ పథకమూ దక్కకుండా చేసి తీరతామని మానసిక వేధింపులకు పాల్పడుతున్నాయి.

• అన్నీ టక్కుటమారాలే!

     కొందరు అధికారులు అధికార పార్టీ సభలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు పనికట్టుకొని మరీ డ్వాక్రా మహిళలను సమీకరిస్తున్నారు. ఆ పార్టీ నాయకులతో అంటకాగుతూ, సమీకరణే తమ విధి నిర్వహణ అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు నిర్వహించేవాటికి డ్వాక్రా మహిళలెవ్వరూ వెళ్లకుండా టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఒక్కరు కూడా కనీసం అటువైపు చూడకూడదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. విపక్షాలు సభ లేదా ఏదైనా కార్యక్రమం చేపడితే వీరిని వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. అసలు వాళ్లను ఇళ్లలోనే ఉండనివ్వడం లేదు. ఏదో ఒక వంకతో కార్యాలయాలకు రప్పిస్తున్నారు. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో వీరు పాల్గొంటారనే అనుమానంతో అధికారులు పలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బాపట్ల ప్రాంతంలో నానారకాల ఆంక్షలు విధించారు. అటువంటి సభలకు వెళ్లేవారికి ఇకపై ప్రభుత్వ రుణాలేమీ అందకుండా చేస్తామని బెదిరింపులకూ దిగారు.

• నియంత ప్రభుత్వం :

    పైస్థాయిలోనూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. పొదుపు మహిళల్ని తరలించుకొచ్చి సభాస్థలిని నింపండని పనిగట్టుకొని శాసిస్తోంది. ఈ వ్యవహారశైలి, పెడపోకడలు వారికి దుర్భరంగా పరిణమించాయి. ఏమాత్రం సంబంధం లేని వాటికి తరలించుకురావడాలు ఎక్కువైపోయాయి. కాదూ కూడదంటే – ఏం జరుగుతుందో మీరే చూస్తారన్న దబాయింపులు మితిమీరిపోతున్నాయి. ప్రతీ డ్వాక్రా సంఘం నుంచి ఎంత మంది రావాలో ముందే చెప్పడం, మండలాలవారీగా బస్సులు వేసి, అవి నిండాల్సిందేనని అదేశించడం, బయల్దేరే సమయానికి సభ్యుల హాజరు తీసుకోవడం… ఇదీ సంగతి! పై వాళ్లు అసలే ఊరుకోరని, అందువల్ల – సభ్యుల్లో ఎవరైనా రాలేకపోతే బదులుగా వేరెవరినైనా పంపాల్సిందేనని హుకుం!! ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ సభలు, ఈ మధ్య’ మూడు రాజధానులు’ పేరిట తిరుపతి, విశాఖ, కర్నూలు ప్రాంతాల్లోని కార్యకలాపాలు….. ఏవి చూసినా స్త్రీలకు తలనొప్పిగా తయారయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల మరో రకం తంటా! గడప గడపకూ అంటూ వైకాపా ఎమ్మెల్యేలు తిరిగేటప్పుడు కూడా…. ఏదైనా ఒక ఊళ్లో కార్యక్రమముంటే, ఇతర గ్రామాల డ్వాక్రా మహిళలనూ అక్కడికి రావాలని ముందుగానే చెప్పేస్తున్నారు. ఎక్కువ జనం వచ్చారని చూపించేందుకు ఇది తప్పదంటున్నారు.

    ఏమిటిదంతా? ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా, నాయకులూ అధికారులకు ముందుగా డ్వాక్రా మహిళలే కనిపిస్తారా? సంఘాలకు ఎటువంటి సంబంధమూ లేనివాటికి ఈ తరలించడా లేమిటి? కర్నూలులో ఇటీవల ఒక వైకాపా సభకు బలవంత తరలింపులయ్యాయి. రాని సంఘాలకు జరిమానాలు తప్పవన్న ఫోన్ హెచ్చరికలూ విస్తరించాయి. డ్వాక్రా సంఘాల్ని ఏర్పాటు చేసింది అధికార పక్ష సభలకు హాజరయ్యేందుకు కాదు. ఆ వ్యవస్థల స్వయం సాధికరత స్ఫూర్తిని ప్రభుత్వమే దెబ్బతీయడం తగదు. మహిళల సంఘటిత శక్తిని దుర్వినియోగం చేయడం క్షంతవ్యం కాని నేరం. మరి ఆ నేరానికి పాలక పక్షమే పాల్పడితే, రాష్ట్రానికి ఏది దిక్కు? బహుళ ప్రయోజనకర డ్వాక్రా స్ఫూర్తిని పరిపూర్తిగా మసక బార్చిన ’కీర్తి’ మటుకు జగన్ సర్కారుదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way