Search
Close this search box.
Search
Close this search box.

కలలను కల్లలు చేస్తున్న కడప ఉక్కు!

kadapa

• రాయలసీమ స్టీల్‌ ప్లాంటుపై తప్పిన అంచనాలు

• ఉత్పత్తి, ఉపాధుల్లో భారీ కోత 

• కార్యాచరణలో…. కాలయాపన

      ”ఎన్నికలకు ఆరునెలల ముందు శంకుస్థాపన చేస్తే దాన్ని మోసం అంటారు. ఎన్నికైన ఆరునెలలకు శంకుస్థాపన చేస్తే దాన్ని చిత్తశుద్ధి అంటారు”… -ఇవి ముఖ్యమంత్రి జగన్‌ ఎత్తిపొడుపు మాటలు. కడప స్టీలు ప్లాంటుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా 2019 డిసెంబరు 23న ఘనంగా పలికిన పలుకులివి. కట్‌ చేస్తే… చూస్తుండగానే మూడున్నరేళ్లు గడిచిపోయాయి. కడప స్టీలు ప్లాంటు నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇప్పుడు… 2022 డిసెంబర్‌ లో ఎన్నికలకు సుమారు 15 నెలల ముందు… మరో సారి కడప స్టీలు ప్లాంటు ప్రస్తావన వార్తల్లోకి వచ్చింది. మరి దీన్ని ‘చిత్తశుద్ధి’ అంటారో, ‘చెత్తశుద్ధి’ అంటారో తెలియదు కానీ… మూడున్నరేళ్ల క్రితం ఘనంగా ఉటంకించిన లక్ష్యాలకి, ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయానికి ఎక్కడా పొంతన కనిపించడం లేదు. ఇది రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించే వారికి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. స్టీటు ప్లాంటు కేంద్రంగా జరిగే అభివృద్ధిని ఊహించే వారిని ఉసూరుమనిపిస్తోంది. ఉక్కు కర్మాగారంలో కొలువులు కోరుకునే వారిని నీరుగారుస్తోంది. ఎందుకంటే… మూడున్నరేళ్ల క్రితం ఘనంగా సాగిన ముఖ్యమంత్రి జగన్‌ ఉపన్యాసంలోని వివరాలను… ఇప్పుడు కొత్తగా చెబుతున్న ప్రకటనలను పోల్చి చూస్తే ‘ఉక్కు’ కలకి నిర్లక్ష్యమనే ‘చెద’ పట్టిందని చెప్పుకోక తప్పని పరిస్థితి! అప్పటి ప్రతిపాదన ప్రకారం కడప ఉక్కు కర్మాగారం పెట్టుబడి రూ. 15,000 కోట్లు. అదే ఇప్పుడు ప్రకటనల ప్రకారం పెట్టుబడి కేవలం రూ. 8,800 కోట్లు. అప్పట్లో అది భారీ ఉక్కు కర్మాగారం. ఇప్పుడది ఓ మినీ ఫ్యాక్టరీ స్థాయి. అప్పటి అంచనాల ప్రకారం 25 వేల మందికి ఉపాధి అవకాశాలు. అదే ఇప్పుడు ఆ సంఖ్యం 6500కు పడిపోయింది. అప్పటి లెక్కల ప్రకారం దాని సామర్థ్యం 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి. అదే ఇప్పుడు మొదటి ఏడాది ఒక్క మిలియన్‌ టన్నులు మాత్రమే. అంటే… అటు పెట్టుబడి దృష్ట్యా చూసినా, ఇటు ఉత్పత్తి ప్రకారం చూసినా, ఇక ఉపాధి అవకాశాల పరంగా చూసినా కడప ఉక్కు కర్మాగారం కల ఎలా కునారిల్లిపోయిందో అర్థమవుతూనే ఉంది. దీనికి కారణం ఏమిటంటే… ఆర్బాటమే తప్ప ఆచరణ కానరాని నిర్లక్ష్యం. ప్రచారమే తప్ప ప్రణాళిక లేని నిర్లక్ష్యం. కార్యాచరణలో కనిపించే నిర్లక్ష్యాన్ని, రాజకీయంగా పేరుకుపోయిన ఉదాసీనతని అర్థం చేసుకోవాలంటే అసలు కడప ఉక్కు కర్మాగారం కల గురించి మొదటి నుంచీ తెలుసుకోవాలి. 

• 15 ఏళ్లు… ముగ్గురు ముఖ్యమంత్రులు…

     అభివృద్ధి అవకాశాలకు దూరమై, వెనకబడిన ప్రాతంగా మిగిలిపోయిన రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు కడప ఉక్కు కర్మాగారం కేంద్రబిందువై దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తూనే ఉంది. ఇప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు వేర్వేరు చోట్ల శంకుస్థాపనలు చేసినా పనులు ముందుకు సాగలేదు. తొలిసారిగా 2007లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంబవరం గ్రామంలో భూమి పూజ చేసినప్పుడు దీని అంచనా ఉత్పత్తి సామర్థ్యం 20 మిలియన్‌ టన్నులు. పెట్టుబడి అంచనా రూ. 20 వేల కోట్లు. దీని వల్ల పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఊరించారు. ఇందుకోసం బ్రహ్మణి స్టీల్స్‌ కంపెనీకి 10,000 ఎకరాలు కేటాయించారు. అప్పట్లో ఎకరాకి కేవలం రూ.18 వేల వంతున బ్రహ్మణి స్టీల్స్‌ కంపెనీకి పది వేల ఎకరాలు కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ ఎకరాల చుట్టూ ప్రహారీ గోడ మినహా ఎలాంటి నిర్మాణం జరగలేదు. పునాది రాయి కూడా ఎక్కడుందో తెలియని స్థితి. ఆపై రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తిరిగి 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంబాలదిన్నె ప్రాంతంలో స్టీలు ప్లాంటుకి శంకుస్థాపన చేశారు. అప్పటి అంచనాల ప్రకారం 18 వేల కోట్ల పెట్టుబడితో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించ తలపెట్టారు. అయితే ఆరు నెలల్లోనే ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా అధికారం అందుకున్న జగన్‌ 2019లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల సమీపంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినప్పుడే… ”ఎన్నికలకు ఆరునెలల ముందు శంకుస్థాపన చేయడం మోసమనిపించుకుంటుందం”టూ గత ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కానీ ఈ మూడున్నరేళ్లలోనూ అడుగు ముందుకు పడింది లేదు. రాయలసీమ కల నెలవేరిందీ లేదు. సమీక్ష సమావేశాలు నిర్వహించడం మినహా ఎలాంటి పురోగతీ లేకపోయింది.

• ఏం ఊడబొడిచారు?

    జమ్మలమడుగు ప్రాంతంలో శంకుస్థాపన చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ కేవలం ఏడు వారాల్లో భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేసి, ఆపై మూడు నాలుగు వారాల్లో పనులు ప్రారంభిస్తామని బీరాలు పలికినప్పుడు రాయలసీమ ప్రజలు ఇన్నాళ్లకు తమ కల నెలవేరుతుందేమోనని మురిసిపోయారు. ”ఎన్నికైన ఆరునెలల్లోనే శంకుస్థాపన చేయడాన్ని చిత్తశుద్ధి అంటార”ని ఆయన ఉటంకించినప్పుడు త్వరలోనే తమ ఆశలు నెరవేరతాయని ఆనందపడ్డారు. కానీ… ఎదురైంది అంతులేని నిర్లక్ష్యమే. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి, ప్రజలను ప్రచారంతో ఊదరగొట్టడానికి తప్ప నిర్దిష్టమైన కార్యాచరణకానీ, ప్రణాళిక కానీ లేవని అందరికీ అర్థమైంది. ఎట్టకేలకు తాజాగా తిరిగి మంత్రివర్గ సమావేశంలో కడప స్టీలు ప్లాంటు గురించి నిర్ణయం ప్రకటించినా… ఉత్పత్తి, పెట్టుబడి, ఉపాధి ప్రతిపాదనలు సగానికి సగం పడిపోవడంతో పెదవి విరుస్తున్నారు. ‘కేంద్రం మెడలు వంచయినా సరే నేషనల్‌ మైనింగ్‌ డెవలప్మెంటు కార్పొరేషన్‌ నుంచి ఇనుప ఖనిజం సరఫరా అయ్యేలా చూస్తామని, మూడేళ్లలో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉండే ఉక్కు కర్మాగారం నిర్మించి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామ’ని శంకుస్థాపన సమయంలో చెప్పిన జగన్‌ మాటల్లో నిజమెంతో ఇప్పుడు అందరికీ అర్థమైంది. కర్మాగారం కోసం 3285 ఎకరాలను సేకరించడం మినహా ఏ పనీ ముందుకు సాగలేదు. భాగస్వామి కంపెనీని ఎంపిక చేయడానికే మూడున్నరేళ్లు పట్టింది. మొదట్లో టాటా, ఎస్సార్‌, లిబర్టీ స్టీల్స్‌ లాంటి కంపెనీల పేర్లు వినిపించినా దేనితోనూ ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు జిందాల్‌ సంస్థతో ఒప్పందం కుదిరినా లక్ష్యాలు తగ్గిపోవడం అందరినీ నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం జిందాల్‌ సంస్థ రూ.3,300 కోట్లతో పనులను ప్రారంభించాల్సి ఉంది. దీని ద్వారా 6500 మందికి ఉపాధి కల్పించగలమని జిందాల్‌ సంస్థ చెబుతోంది. ఇంతకీ ఈ సంస్థ ఎప్పుడు నిర్మాణం ప్రారంభిస్తుంది? ఎప్పటికి పూర్తి చేస్తుంది? ఎప్పటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభిస్తుంది? ఎప్పుడు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది? ఇవన్నీ ప్రస్తుతానికి శేషప్రశ్నలే. జగన్‌ చెబుతున్న ”చిత్తశుద్ధి”కి సవాళ్లే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
భారతీయం
భారతీయం - వైదిక సంప్రదాయం
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way