• పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 205వ రోజున 43వ డివిజన్ పి.ఎన్.ఎం. స్కూల్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇంటింటికీ పర్యటిస్తున్న సమయంలో పలువురు మహిళలు, వృద్ధులు తమ సామాజిక పింఛన్లను అకారణంగా తొలగించిన తీరుని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వార్డు సచివాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా తమ సమస్య తీరడం లేదని వివరించారు. దీంతో బాధితులతో కలిసి కేతంరెడ్డి సంబంధిత వార్డు సచివాలయాన్ని సందర్శించారు. అధికారులతో పింఛన్ తొలగింపునకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డుల విభజన వంటివి ప్రభుత్వం చేతిలో ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. జనసేన డివిజన్ నాయకులకు ఈ పింఛన్ల తొలగింపు అంశాన్ని వారం పాటు పరిశీలన చేయాలని, బాధితులను గుర్తించి సచివాలయంతో సంప్రదింపు జరిపి పరిష్కారం దిశగా అధికారులను కోరాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే వారం రోజుల తరువాత ప్రత్యక్ష పోరాటంలోకి దిగుతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.