రహదారిపై గుంతల్ని పూడ్చి ప్రజల ప్రాణాలు కాపాడండి.. యాదమరి ఎంపీడీవోకి వినతిచేసిన జనసేన, బీజేపీ నాయకులు
చిత్తూరుజిల్లా, పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని యాదమరి-పరదరామి ప్రధాన రహదారిపై, రహదారికి ఇరువైపులా బావులను తలపించేలా ఏర్పడ్డ గుంతల్ని పూడ్చి ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు లేకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జనసేన, బీజేపీ నాయకులు సంయుక్తంగా ఎంపీడీవో శ్రీనివాస్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని యాదమరి, పరదరామి ప్రధాన రహదారిపై స్థానిక పోలీస్ స్టేషన్ నుండి తమిళనాడు సరిహద్దు వరకూ గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారిందన్నారు. నిత్యం ఈ రహదారిపై ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వాళ్ళు గుంతల కారణంగా అదుపు తప్పి బోల్తా పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తద్వారా గాయపడిన వారు క్షతగాత్రులవుతున్నారని ఎంపీడీవోకి వివరించారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే రోడ్డుపై ఏర్పడిన గుంతల్ని మరమ్మత్తులు చేసి ప్రజలు సాఫీగా ప్రయాణించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని యాదమరి MPDO శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు పుంగనూరు నానబాల లోకేశ్వర (లోకేష్ రాయ్), నరిగన్నగారి తులసీ ప్రసాద్, కుమార్, మనోహర్, పూల హరి, ఓంప్రకాష్, నిఖిల్ కళ్యాణ్, జాకీర్, బాబు,నూర్ బాషా, మహమ్మద్, రాజా, రవి, జగన్, బీజేపీ నాయకులు విజయేంద్ర యాదవ్, వేణుయాదవ్, ఢిల్లీ బాబు, దినేష్, శివకుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.