నెల్లూరు ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 169వ రోజున 48వ డివిజన్ కోటమిట్ట సుబ్రహ్మణ్యస్వామి గుడి వెనుక ప్రాంతంలో నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో గ్రీవెన్స్ డే, 1100 ఫోన్ ఫిర్యాదుల కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్పందన పేరుతో మార్చిందని, తాజాగా ప్రజాసమస్యలను ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చంటూ కొత్త నెంబర్ ని ఇచ్చిందని, ఇదంతా పెద్ద డ్రామాలా మారిందని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే స్థానికులు కొందరు గతంలో ఉండే 1100 నెంబర్ కి ఫోన్ చేస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి ఫోన్ కనెక్ట్ అవుతుందని, ఏపీ నెంబర్ కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా సరిగ్గా కలవడం లేదని తెలిపారన్నారు. పోనీ ఈ స్పందనలో, ఫోన్ ఫిర్యాదుల్లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారా అంటే లేదని, గతంలో ఫించన్, రేషన్ కార్డులు ఇలా ఏ ఫిర్యాదులు ఉన్నా పరిష్కారం అయ్యేవని కానీ ఇప్పుడు వార్డు సచివాలయాలకు ఫిర్యాదులను బదిలీ చేసి ప్రజలు సచివాలయాల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని అన్నారు. స్పందన ఫిర్యాదుల్లో ఆధార్ ను అనుసంధానం చేస్తున్నారని, సమస్యలు పరిష్కారం కాని ప్రజలు,ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం పై అసహనంతో ఉన్న ప్రజలు, వైసీపీకి ఓటేయరు అని గ్రహించి సంబంధిత ఓట్లను కూడా తొలగిస్తున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.