• విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన 9 మంది జనసేనపార్టీ నాయకులు
• కారాగారం వద్ద సాదర స్వాగతం పలికిన జనసేనపార్టీ నాయకులు, శ్రేణులు
విశాఖపట్నం, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసిన 9 మంది జనసేన నాయకులు శనివారం బెయిల్ పై విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు. వీరిపై అక్రమంగా పెట్టిన హత్యాయత్నం కేసులపై జనసేనపార్టీ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులు శనివారం సాయంత్రం జైలు అధికారులకు అందడంతో 9 మందిని విడుదల చేశారు. జనసేన నాయకులకు పార్టీ శ్రేణులు, నాయకుల బృందం కేంద్ర కారాగారం వద్ద సాదర స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జైలు నుంచి విడుదలైన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు.
●అరాచకాలతో ఎంత కాలం పాలన చేస్తారు? కోన తాతారావు జనసేన పార్టీ పీఏసీ సభ్యులు
వైసీపీ ప్రభుత్వం అరాచకాలతో, అక్రమాలతో పాలన సాగించడం బాధాకరం. ప్రజాస్వామ్య విలువలను న్యాయస్థానాలు మాత్రమే కాపాడాయి. ఉత్తరాంధ్ర ప్రజలంతా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికితే ఈ ప్రభుత్వానికి కడుపు మంట ఎందుకు..? ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. జనసేన పార్టీకి న్యాయవ్యవస్థలపై పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ వ్యవస్థలే ప్రజాస్వామ్యానికి ఊపిరి పోశాయి.
● మా పోరాటం ఆగదు : సుందరపు విజయ్ కుమార్, జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి మేం ముందుకు సాగుతాం. మా పార్టీ విధానం కూడా అదే. అబద్ధపు కేసులు, అక్రమ కేసులు ప్రజా పోరాటాలను ఆపలేవు. ప్రజలను పాలించాలని జగన్ మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారుగానీ వారి పార్టీ అక్రమాలకు అడ్డు చెప్పిన వారిని అణిచివేయడానికి కాదు. భవిష్యత్తులో ఎవరిది నిజమైన పోరాటమో, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తుంది. ఇక్కడితో మేం భయపడిపోయాం అనుకోవద్దు. ఇప్పుడే అసలైన యద్ధం మొదలైంది.
● మాది న్యాయమైన యుద్ధం : పంచకర్ల సందీప్ భీమిలి నియోజకవర్గ ఇంఛార్జి
మేం చట్టం పరిధిలోనే నడుచుకునే బాధ్యత కలిగిన జన సైనికులం. అమాయకుల మీద కేసులు పెట్టి అణిచివేశామని ప్రభుత్వం అనుకుంటే పొరపాటే. న్యాయపరంగా చేసే యుద్ధంలో కచ్చితంగా విజయం సాధిస్తాం. ప్రభుత్వం సాగించే దాష్టీకాలను అంతే బలంగా ఎదుర్కొంటాం. మాకు ఈ ప్రయాణంలో మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. సంఘీభావంగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
● అక్రమ అరెస్టులకు వెరవం : పీవీఎస్ఎస్ఎన్ రాజు చోడవరం ఇంఛార్జి
అప్రజాస్వామికంగా చేసిన అక్రమ అరెస్టులు ఎంతో కాలం సాగవు. భవిష్యత్తులోనూ జనసేన ప్రజా పోరాటాలు ఆగవు. అణిచి వేయాలని చూస్తే మరింతగా బలపడతాం. మరిన్ని పోరాటాలకు సిద్ధం అవుతాం. నియంత పోకడలు ఎంతోకాలం సాగవు. ఈ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జైలు నుంచి విడుదలైన వారిలో జనసేన పార్టీ నాయకులు పీతల మూర్తి యాదవ్, కొల్లు రూప, చిట్టిబిల్లి శ్రీను, రాయపురెడ్డి కృష్ణ, జి. శ్రీనివాసపట్నాయక్ లు ఉన్నారు. జైలు నుంచి విడుదలైన నాయకులకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ ఇంఛార్జి పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర కార్యదర్శులు ఎ.దుర్గా ప్రశాంతి, బోడపాటి శివదత్, జనసేనపార్టీ రాష్ట్ర లీగల్ సెల్, విశాఖపట్నం లీగల్ సెల్ సభ్యులు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర, జిల్లా సభ్యులు స్వాగతం పలికారు.