నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ లో జనవాణి కార్యక్రమం చేయకుండా నిలువరించి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలని అక్రమంగా అరెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి పోలీసు నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరులో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్థానిక కపాడిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పుష్పాంజలి ఘటించి పవన్ కళ్యాణ్ గారికి అందజేసిన పోలీసు నోటీసు కాపీని అంబేద్కర్ విగ్రహానికి సమర్పించడం జరిగింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 154వ రోజున 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో జరిపిన అనంతరం సమీపంలోని కాపాడిపాలెంలో గల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు బ్రతికుండి ఉంటే ఆయనకు కూడా ఈ దుర్మార్గ వైసీపీ పాలనలో పోలీసుల చేత నోటీసులు ఇప్పించేవారన్నారు. వైజాగ్ లో భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాసమస్యలపై సదస్సులు, పోరాటాలు చేసుకునే హక్కుని అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించి ఉన్నారని, కానీ నేడు రాష్ట్రంలో వైసీపీ తమ సొంత అజెండాతో పోలీసులను ఉపయోగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో రాజేస్తున్న చిచ్చు ఇప్పటితో ఆగదని, ప్రజలందరూ వీరి ఆగడాలను భరించలేక ఏకమై శ్రీలంకలో ఎలాగైతే తిరుగుబాటు చేశారో అలాంటి పరిస్థితులు కొనితెచ్చుకునే స్థితిలోకి రాష్ట్రాన్ని మార్చేస్తున్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.