దాచేపల్లి ( జనస్వరం ) : దాచేపల్లి మండలం నగర పంచాయతీ పరిధిలోనీ నడికుడి వద్ద ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడి 11ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన దురదృష్టకరమని గుంటూరు జిల్లా కార్యదర్శి అంబటి మల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ చిన్నారుల జీవితాల్ని చిదిమేస్తున్న క్వారీ లీజులను నిలిపివేయాలి. ఎంతమంది చిన్నారుల ప్రాణాలు బలి తీసుకుంటే మొద్దు నిద్ర పోతున్న మైనింగ్ శాఖ అధికారులు కళ్ళు తెరుస్తారు. మైనింగ్ నిబంధనలను పాటించని క్వారీలపై వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. దాచేపల్లి క్వారీల తవ్వకాలతో అక్రమార్కులు కోట్లు గడిస్తుంటే అభం శుభం తెలియని కొన్ని కుటుంబాలకు కంఠశోష మిగులుతుంది. శ్రీనివాసపురం ఘటన జరిగినప్పుడు క్వారీయింగ్ జరుగుతున్న ప్రతి చోటా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని అప్పటి మైనింగ్ అధికారులు ఇచ్చిన హామీ నీటి మీద బుడగ చందంగా మిగిలిపోయిందన్నారు. శ్రీనివాసపురం ఘటన తర్వాత చర్యలు తీసుకున్నట్లయితే ఈరోజు అభం శుభం తెలియని బాలుడి తల్లిదండ్రులకు కడుపు కోత కలిగేది కాదన్నారు. జరిగిన ఘటనకు మైనింగ్ శాఖ అధికారులు, క్వారీ యజమానులు బాధ్యత వహించాలి. జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. బాధిత బాలుడి కుటుంబ సభ్యులకు 20 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలని, బాధిత బాలుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు.