గుంతకల్ ( జనస్వరం ) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రకటించిన షాదీ తోఫా పథకం అమలులో చిత్తశుద్ధి లేదని జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం ఫిరోజ్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లీంలలో వైఎస్ఆర్సీపి పట్ల వ్యతిరేకత లేకుండా చేసుకుని, తమకు సానుకూలంగా మార్చుకోవాలనే వ్యూహాత్మకంగా షాదీతోఫా పథకాన్ని తెరమీదకు తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాన్ని పొందేందుకు 10వ తరగతి విద్యార్హతలు పేర్కొనడంతో అనేక మంది పేదవారు ఈ పథకం ఫలితాలను పొందలేని విచిత్ర పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒకే అమ్మాయికి వర్తిస్తుందనటం సరైంది కాదని మైనార్టీలలో అసమానతలు పెంచేందుకే ఈ పథకాన్ని తీసుకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఆరంభ శూరత్వంగా పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దికాలానికే నిలిపివేసి, ప్రస్తుతం అంతే తొందరగా ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వివాహమైన అర్హులైన అందరినీ పరిగణనలోనికి తీసుకుని ప్రయోజనం కల్పించాలని, విద్యార్హత నిబంధనను బేషరతుగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే దుల్హన్ పథకం మొత్తాన్ని లక్షకు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చదువుకోలేకపోయిన పేదలు పెళ్లి చేసుకుంటే లబ్ధి చేకూర్చని పథకాలు ఎందుకని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారం చేపడితే వెంటనే నిరుపేద ముస్లింలకు సైతం లబ్ది చేకూరేలా బహుళ ప్రయోజక పథకాలను ప్రవేశపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.