అమరావతి, (జనస్వరం) : అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్ష 1000 రోజులు అయిన సందర్భంగా ఈరోజు “అమరావతి నుండి అరసవల్లి పాదయాత్ర 2.0” వరకు రైతులు పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ పాదయాత్ర మొత్తం 60 రోజులలో పూర్తి అవుతుంది. రైతులు చేస్తున్న ఈ మహా పాదయాత్రకు సంఘీభావంగా గుంటూరు జనసేనపార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని రైతులకు మద్దతుగా వారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1000 రోజులుగా అమరావతి రైతులు పోలీస్ కేసులకు భయపడకుండా, లారీ దెబ్బలకు వెరవకుండా, బెదిరింపులకు లొంగకుండా చేస్తున్న ఉద్యమం ఓ గొప్ప అధ్యాయం అని చెప్పారు. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రకు జనసేనపార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. అమరావతి రైతులు గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్రకు సైతం జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన మేరకు జనసేనపార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు. సంఘీభావంగా పాదయాత్రలోనూ పాల్గొన్నాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అమరావతి రైతుల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం తీరును ప్రజలంతా గమనించాలి. మూడేళ్లలో అమరావతికి ఒక ఇటుక కూడా పేర్చని ఈ ముఖ్యమంత్రి, రాజధానిని అడ్డుకోవడానికి, అమరావతి రైతులకు ఆటంకాలు సృష్టించడానికి మాత్రం రకరకాల ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటు. ఒక పక్క న్యాయస్థానాలు చెబుతున్నా వినకుండా, మళ్ళీ మళ్ళీ మూడు రాజధానుల పాట పాడడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. కచ్చితంగా ఇలాంటి కుట్రలను జనసేనపార్టీ తరఫున అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కడప మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, యర్రగోపుల నాగరాజు, శిఖా బాలు, కొర్రపాటి నాగేశ్వరరావు, నెల్లూరు రాజేష్, మహంకాళి రైతులు తదితరులు పాల్గొన్నారు.