నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 112వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్, చెప్పుల ఫ్యాక్టరీ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆనందంగా గురుపూజోత్సవాల్లో పాల్గొనాల్సిన ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వంలో ఆనందంగా లేరని విమర్శించారు. ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ మోసం చేసిన సీఎం జగన్ పై జరిగిన ఛలో విజయవాడ కార్యక్రమం ఆనాడు అత్యంత విజయవంతం కావడం వెనుక ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఆవేదన ఉందని, కానీ వైసీపీ ప్రభుత్వం ఆ ఆవేదనను అర్థం చేసుకోకుండా వారిపై కక్ష కట్టిందని ఆరోపించారు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బాగా చెప్పాలని ఆశిస్తారని, పనితీరుని బోధన ఆధారంగా కొలుస్తారని, కానీ నేడు వైసీపీ ప్రభుత్వం బోధన తప్పించి ఉపాధ్యాయుల చేత అనేక పనులు చేయిస్తూ, ఆఖరికి మద్యం దుకాణాల దగ్గర కాపలాగా నిలబెడుతూ అవమానించిందని అన్నారు. ఈ బోధనేతర పనులను కొలిచేందుకు మొబైల్ యాప్ లను రూపొందించి ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. టీచర్లకు ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానున్నారని, పవనన్న ప్రభుత్వంలో ఫిన్ ల్యాండ్ తరహా విద్యావిధానం తీసుకొస్తామని, ఆ విధానంతో రాష్ట్రంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తిగా ఉపాధ్యాయ వృత్తి ఉంటుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.