నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 111వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్, మైత్రీ వాటర్ ప్లాంట్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది చేయూత పథకం క్రింద 18వేలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కరెంట్ బిల్లుని సాకుగా చూసి ఆపేసిందని పలువురు వాపోయారు. ఉమ్మడి కుటుంబాల్లో కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటడం సహజమేనని, ఆ కారణాన్ని చూపి పథకాన్ని నిలిపివేయడం సమంజసమా అని పలువురు మహిళలు ప్రశ్నించారు. సీఎం జగన్ ఇచ్చే పథకాలకు అర్హత సాధించాలంటే పేదరికం ఒక్కటే సరిపోదా, కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి బ్రతకాలా అని కొందరు మహిళలు ఎద్దేవా చేశారు. సమస్యను క్షుణ్ణంగా విన్న కేతంరెడ్డి మాట్లాడుతూ చేయూత పథకం క్రింద ఒక్కో మహిళకు నాలుగు సంవత్సరాల్లో ఒక్కో ఏడాది 18750 రూపాయల చొప్పున మొత్తం 75వేల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం అనేకమందికి ఒక్క ఏడాది ఇచ్చి చేయి దులుపేసుకుని, మరుసటి ఏడాది నుండి ఆపేసిందని దుయ్యబట్టారు. ఒక ఏడాది పేదోళ్లయిన ప్రజలు, మరుసటి ఏడాదికి డబ్బున్న వారిగా మారిపోయారా అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా గాజు గ్లాసు గుర్తుకి ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.