అమరావతి, (జనస్వరం) : తిరుపతి జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు పళ్లిపట్టు నాగరాజు, సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్ లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషదాయకం అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారిరువురికీ నా తరఫున, జనసేన పార్టీ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. యువ విభాగంలో పురస్కారానికి ఎంపికైన పళ్లిపట్టు నాగరాజు రాసిన ‘యాలై పూడ్సింది’లో ఆయన రాసిన కవితల్లో ఒకటి చదివాను. నేటి యువత చైతన్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఆ అక్షరాలు చూపాయి. బాల సాహిత్య విభాగంలో పురస్కారం పొందిన పత్తిపాక మోహన్ కవితా సంకలనం ‘బాలల తాతా బాపూజీ’లో జాతిపిత గురించి భావి పౌరులకు అర్థమయ్యేలా చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నం. తెలుగు భాషను తెలుగు వారికి దూరం చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అమ్మ భాషను కాపాడుకొంటూ భావి తరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం మనందరిపై ఉంది. నాగరాజు, మోహన్ లాంటి కవులు చేస్తున్న ప్రయత్నాలకు పురస్కారాలు దక్కడం ముదావహం. ఈ స్ఫూర్తితో నవ కవులు, రచయితల నుంచి మరిన్ని ఉత్తమ రచనలు రావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.