హైదరాబాద్, (జనస్వరం) : ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం విపక్ష పార్టీల కర్తవ్యం. ఆ బాధ్యతను జనసేన పార్టీ ఎప్పుడూ విస్మరించదు. దానిని నిర్వర్తించేందుకు జనసేన పార్టీ వీర మహిళలు వెళ్తే అధికార పక్ష ఎమ్మెల్యే దుర్భాషలాడటం దురదృష్టకరం. 10 రోజుల క్రితం డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, గంటి పెదపూడిలో వరద బాధల్లో ఉన్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ వీర మహిళలు ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడం ప్రభుత్వ సంకుచిత ధోరణిని తెలియచేస్తోంది. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన వేళ జనసేన పార్టీ జిల్లా నాయకుల్ని హౌస్ అరెస్ట్ లు చేసినా, ఏ మాత్రం తొణకకుండా వరద బాధితుల సమస్యలను చెప్పడానికి ప్రయత్నించిన జనసేన వీర మహిళలను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అసభ్య పదజాలంతో దూషించడం అత్యంత బాధాకరమని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గంటి పెదపూడిలో వరద సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేను ధైర్యంతో నిలదీసిన వీరమహిళలకు పవన్ కళ్యాణ్ శాలువాలు కప్పి సత్కరించారు. వారికి వెండి మహిషాసుర మర్దిని అమ్మవారి ప్రతిమలను బహూకరించారు. పవన్ కళ్యాణ్ నుంచి సత్కారం అందుకున్న వారిలో గంటా స్వరూప, ఎమ్. ప్రియా సౌజన్య, చల్లా లక్ష్మీ, కె.నాగ మానస, సుంకర కృష్ణవేణి, మేడిసెట్టి సత్యవాణి, బోడపాటి రాజేశ్వరి, బర్రె లక్ష్మీ, మోటూరి కనకదుర్గ ఉన్నారు. గంటి పెదపూడిలో జరిగిన ఘటనపైనా, వరద బాధితులకు ఎదురైన సమస్యపైనా ఆరా తీశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘వరదల్లో చిక్కుకున్న వారి సమస్యలను చెబుతున్న వీర మహిళల మీద ఇష్టానుసారం ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం హేయం. సమస్యలు పరిష్కరించండి అని వినతిపత్రం ఇవ్వడానికి జనసేన నాయకులు వస్తే ఎందుకు భయం..? ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం సాధారణ విషయం. అలా చేస్తేనే ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయి.
ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వస్తుంటే, ముందుగా అక్కడున్న నాయకుల్ని గృహ నిర్భందాలు చేస్తున్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వమని మేం కోరుతుంటే మీకు ఉలుకెందుకు..? సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడుతున్న వారిని ఇష్టానుసారం బూతులు తిడుతున్నారు. కేసులు పెడుతున్నారు. జనసేన పార్టీకి వీర మహిళలు భవిష్యత్తు వారధులు. వారి పోరాటాలు మాకు స్ఫూర్తి మంత్రాలు. అడ్డగోలు కేసులకు, బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా నిలబడే వీర మహిళలకు పార్టీ ఎల్లపుడూ అండగా నిలబడుతుంది. వీర మహిళలు పార్టీకి పునాదులుగా పని చేస్తారు. వారి పోరాటాలను మరింత విస్తృతం చేసేందుకు పార్టీ తరఫున త్వరలోనే వర్క్ షాపులను నిర్వహించి, వర్తమాన సామాజిక, రాజకీయ విషయాలపైనా వారికి అవగాహన కల్పిస్తాం. కచ్చితంగా అద్భుతమైన ప్రజా నాయకురాళ్లుగా తయారు చేస్తాం.
ప్రజల పక్షాన పోరాడాలి
ప్రజాస్వామ్య దేశంలో మహిళల పాత్ర మరింత పెరగాలి. చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు జరిగేలా జనసేన పార్టీ తన వంతు ప్రయత్నం తప్పనిసరిగా చేస్తుంది. వీర మహిళల మీద ఇష్టారీతిన నోరు పారేసుకున్న ఎమ్మేల్యే మీద మహిళా కమీషన్ కు, మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తాం. పార్టీలో మహిళలను గౌరవించుకుంటాం… వారికి తగిన స్థానం ఇస్తాం. వీర మహిళల పోరాటాలను భావితరాలకు పాఠంగా చెప్పేలా మరిన్ని ప్రజా పోరాటాలు చేయాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.