– పవనన్న ప్రజాబాటలో ప్రశ్నించిన జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 73వ రోజున మూలాపేటలోని మల్లిఖార్జునపురం ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యనిషేదం చేస్తామంటూ, మాట తప్పం మడమ తిప్పం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రెడ్డి మద్యనిషేదం అనే మాట మార్చి మద్యనియంత్రణ అని అన్నారని, తర్వాత ఆ మాట కూడా మార్చి, మడమ కూడా తిప్పి విచ్చలవిడిగా ప్రభుత్వ మద్యం దుకాణాలతో పాటు ఎలైట్ దుకాణాలు తెరిచారని దుయ్యబట్టారు. ఇప్పుడు కాలపరిమితి తీరిపోయిన బార్లను మూసేసి మద్యనియంత్రణ చేయకుండా నూతనంగా 840 బార్లకు అనుమతులివ్వడం చూస్తుంటే జగన్ రెడ్డిది అసలు విలువలతో కూడిన రాజకీయమేనా అని ప్రశ్నించారు. ఒక్క నెల్లూరు నగరంలోనే 35 బార్లకు అనుమతులిచ్చారని, ప్రభుత్వ మద్యం దుకాణాలు, ఎలైట్ షాపులతో పాటు ఇప్పుడు బార్లను కలిపి చూస్తే నెల్లూరు నగరంలో వీధికో మద్యం దుకాణం ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నెల్లూరు సిటీలో నూతనంగా ఏర్పాటయ్యే బార్లకు సంబంధించి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే సిండికేట్ ను ఏర్పాటు చేసి వారివద్ద కమీషన్లు తీసుకుని వారి చేతే డిపాజిట్ చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అమాయకులేమీ కాదని, మద్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలా మోసం చేసిందో గమనిస్తూ ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.