మదనపల్లె, (జనస్వరం) : జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని చేపట్టిన తరువాత అధికార దుర్వినియోగం శ్రుతి మించిపోతుందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలిపారు. ప్రజల ఇబ్బందులు పట్టకుండా కేవలం తమ నాయకుల, కార్యకర్తల సౌకర్యం మాత్రం చూసుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రికార్డ్ స్థాయిలో 1812 ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. ప్రైవేట్ కార్యక్రమాలకు ఆర్టీసీ సెక్యూరిటీ డిపాజిట్ తో పాటు అద్దె జీఎస్టీ కలిపి వసూలు చేస్తారు. వైసీపీ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 1800 కి మించి బస్సులు తీసుకున్న వాటికి డిపాజిట్ చెల్లించలేదని తెలుస్తుంది. అధికారం తమ దగ్గర ఉందని ఇష్టమొచ్చినట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బస్ స్టాండ్ కిటకిటలాడింది కానీ బస్సులన్నీ వైసీపీ ప్లీనరీకి వెళ్లడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి మీరు పార్టీ మీటింగులు పెట్టుకొంటే ప్రజలెందుకు ఇబ్బందులు పడాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని ప్రజలందరూ ఏకమై ముక్త కంఠంతో ఖండించాలని అనిత తెలిపారు.