విజయవాడ, (జనస్వరం) : “జనవాణి”కి సమస్యల వెలువను చూసి తాడేపల్లి ప్యాలెస్ మూగబోయిందని జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. సోమవారం స్థానిక పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవాణి – జనసేన భరోసాకు వినతులు వెల్లువెత్తాయని, జోరు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా పవన్ కళ్యాణ్ కి బాధితులు వినతిపత్రాలు సమర్పించారంటే సామాన్యుల కష్టాలు జగన్ పాలనలో ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వానికి హృదయమే కాదు. సామాన్యుల సమస్యలు వినడానికి, చూడడానికి కళ్ళు, చెవులు కూడా లేవని ఎద్దేవా చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పూలతో ఘన స్వాగతం పలుకుదాం అనుకుంటే… విజయవాడ నగరం పవన్ కళ్యాణ్ కి సమస్యలతో స్వాగతం పలికిందని ప్రజా సమస్యలు విని, పోరాడి పరిష్కరించడానికి నేనున్నానని సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన అన్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా 1200 పైగా వినతి పత్రాలు వచ్చాయంటేనే జగన్ రెడ్డి పరిపాలన ఏవిధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జనవాణి జనసేన భరోసా ద్వారా స్వీకరించిన వినతి పత్రానికి స్పందించి, పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. జగన్ అసమర్ధ, దరిద్రమైన పరిపాలనకు కాలం చెల్లిందని, వైసీపీ ప్లీనరీ కోసం వాలంటరీలను డ్వాక్రా మహిళలను అధికారులను బస్సుల్లో తరలించారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, పెయిడ్ ఆర్టిస్టుల తో ప్లీనరీ సాగిందని, ఈవెంట్ అవగానే మీటింగ్ ఖాళీ అయిపోయిందని, జగన్ ముగింపు ప్రసంగానికి ఖాళీ కుర్చీలు మిగిలాయని, దీని ద్వారా ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అర్ధమైపోతుందని, జగన్ కష్ట కాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి షర్మిల పార్టీ నిలబెట్టారని అలాంటి షర్మిలని ఇంటి నుంచి వెళ్ళగొట్టారని, అమ్మతో బలవంతపు రాజీనామా చేయించారని, జగన్ కి మహిళా సాధికారకత గురించి మాట్లాడే నైతికత లేదని, మహిళా సాధికారత అంటే తల్లిని చెల్లిని మోసం చేయడమా అని వైసీపీ శ్రేణులు సీఎం జగన్ ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.