– మహిళల పొదుపు డబ్బుల్ని షూరిటీగా చూపెట్టి ప్రభుత్వం బ్యాంకుల నుండి ఋణం తెచ్చుకుంటోంది
– నెల్లూరులో కొన్ని బ్యాంకులు మహిళల పొదుపు గ్రూపు ఖాతాలో లక్ష రూపాయలకు పైగా ఉన్న దాంట్లోనే గ్రూపు సభ్యులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామంటున్నారు
– పవనన్న ప్రజాబాటలో వైసీపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టిన జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 49వ రోజున పాత చెక్ పోస్ట్ సెంటర్, అహ్మద్ నగర్, బోడిగాడితోట ప్రాంతాలలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించారు. సావధానంగా ప్రతి ఒక్కరి సమస్యను విన్న కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్గించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి దృష్టికి పలువురు మహిళలు తమ పొదుపు గ్రూపు ఖాతాల్లో తాము దాచుకున్న డబ్బులో నుండి ఋణం అవసరం ఉన్న సభ్యులకు ఇవ్వమంటే కొన్ని బ్యాంకులు ఇవ్వట్లేదని వాపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా లక్ష రూపాయలను పొదుపు గ్రూపు ఖాతాలో ఉంచాలని, లక్షకు మించి దాచి పెట్టున్న డబ్బులో నుండి మాత్రమే గ్రూపు లీడర్లు చెప్పిన సభ్యులకు ఋణం ఇస్తాం అని చెప్తున్నారని వాపోయారు. మహిళల సమస్య విన్న కేతంరెడ్డి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పొదుపు డబ్బుల్ని షూరిటీగా చూపెట్టి వవైసీపీ ప్రభుత్వం బ్యాంకుల నుండి కోట్లాది రూపాయల ఋణం తీసుకుని ఉందన్నారు. ఒక్కో గ్రూపులో లక్ష రూపాయల మహిళల పొదుపు డబ్బుని ఆ షూరిటీ క్రింద కొన్ని బ్యాంకులు ఉంచుకుంటున్నాయని, అందుకే ఆ డబ్బులో నుండి గ్రూపు సభ్యులకు అవసరం ఉన్నా, సభ్యులందరి ఆమోదం ఉన్నా బ్యాంకులు ఋణాలు ఇవ్వట్లేదన్నారు. ఆడబిడ్డలు దాచుకున్న డబ్బుని తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరని, ఒక్క జగన్ రెడ్డి గారికే ఈ ఘనత దక్కుతుందని ఎద్దేవా చేసారు. మహిళల్ని ఇంతలా మోసం చేస్తున్న వైసీపీని ఈసారి ఓడించాలని, మహిళలందరూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించాలని, పవనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత సాధ్యమవుతుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.