– అర్హులైన యువతకు తలా 10లక్షల రూపాయల ఋణాలిస్తాం
– పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే యువతరానికి అందే భరోసా ఇది
– జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో ఓ భాగం
– యువతకు ఇవ్వాల్సిన ఋణాల నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది
– కులాల కార్పొరేషన్లఛైర్మెన్లు ఏ కులానికి ఏ పథకంలో ఎంత డబ్బులు పడ్డాయో లెక్కలు వ్రాసే గుమాస్తాలుగా మారిపోయారు
– స్వయం ఉపాధి పొందే మార్గాలన్నీ వైసీపీ ప్రభుత్వంలో మూసుకుపోయాయి
– పవనన్న ప్రభుత్వంలో ఋణాలు అందించి యువ పారిశ్రామికవేత్తలను తయారుచేస్తాం
– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు ( జనస్వరం ) : గత 37 రోజులుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 37వ రోజున స్థానిక సత్యనారాయణపురం, ఎస్వీఆర్ స్కూల్ వీధి ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలుకరించిన కేతంరెడ్డి వారి సమస్యలను కనుగొని పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాటలో 37 రోజుల పాటు ఇప్పటికి సుమారు 9000 ఇళ్ళు తిరిగితే ప్రతి ఇంట్లో ఏదొక సమస్య చెప్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా లేకుండా ప్రతిఒక్కరూ సమస్యలతో అల్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఆయా ఇళ్ళలో యువత పట్ల, వారి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. యువతరం ఆసక్తికి అనుగుణంగా వివిధ వ్యాపారాలు, చిన్న స్థాయి పరిశ్రమలు పెట్టుకునేలా సబ్సిడీ ఋణాలిచ్చి ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయట్లేదని ప్రజలు వాపోతున్నారని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా యువతీయువకులకు స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం నుండి కొంతమేర సబ్సిడీ ఋణాలు అందేవని, కానీ వైసీపీ ప్రభుత్వంలో కులానికో కార్పొరేషన్ ఉన్నా కూడా ఋణాలిచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రతి కులానికి ఓ కార్పొరేషన్ పెట్టి అందులో వైసీపీ నాయకులను సభ్యులుగా పెట్టి జీతాలిస్తున్నారు తప్పించి, వాస్తవంలో కుల కార్పొరేషన్ల వల్ల ప్రజలకు కల్గిన లాభం ఏమీ లేదని విమర్శించారు. కులాల కార్పొరేషన్ల ఛైర్మెన్లు ఏ పథకంలో ఎంత డబ్బు తమ కులం వారికి పడుతుందో లెక్కలు వ్రాసి చెప్పే గుమాస్తాలుగా మారారని విమర్శించారు. యువతరం ఆశలను వైసీపీ ప్రభుత్వం అడియాసలు అయ్యేలా చేస్తోందని, ఈ పరిస్థితిలో మార్పును పవనన్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తారని తెలిపారు. అర్హులైన, ప్రతిభావంతమైన యువతకు తలా 10 లక్షల రూపాయల ఋణం ఇచ్చి వారి వ్యాపారాలకు, పారిశ్రామిక అవసరాలకు భరోసాగా నిలవాలనేది జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంలో ఓ భాగం అని కేతంరెడ్డి వివరించారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాగానే యువతకు స్వయం ఉపాధి కల్పించే అంశాలపై ఇప్పటినుండే తమ పార్టీ అధ్యయనం చేస్తోందని, పవనన్న ప్రభుత్వంలో ఋణాలు అందించి యువ పారిశ్రామికవేత్తలను తయారుచేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.