నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట పదో రోజుకు చేరింది. మైపాడు రోడ్డు వద్ద రాజీవ్ గాంధీ నగర్,మధురానగర్ ల లోని పలు వీధుల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలను కనుక్కొని పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు కేతంరెడ్డి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఈ ప్రాంతంలోని పలు కుటుంబాల్లోని మహిళలు పెరిగిన కరెంట్ బిల్లులపై తమ బాధను వ్యక్తం చేశారు. తామంతా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారమని, ఈ వైసీపీ ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచకముందు నూట ఎనభై నుండి రెండు వందల రూపాయల కరెంట్ బిల్లు వచ్చేదని, కానీ ఇప్పుడు ఆరు వందల రూపాయలు దాటి వస్తోందని వాపోయారు. ప్రజలు ఇళ్ళల్లో లైట్లు, ఫ్యాన్లు వేసుకోకుండా చీకటిలో ఉక్కపోత బ్రతుకులు బ్రతకాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశమా అని మహిళలు విమర్శించారు. ఎవరయ్యా ఈ రోజుల్లో ఏసీలు లేకుండా బ్రతికేది, నెల్లూరు చుట్టుపక్కల పొగ గొట్టాల వల్ల వాతావరణం ఎలా మారిపోయిందో తెలియదా అని మహిళలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇళ్లల్లో ఏసీలు ఉన్నాయని పింఛన్ తో సహా అన్ని పథకాలు ఎత్తేస్తున్నారని, కరెంట్ బిల్లులు వీళ్ళే పెంచి మరలా కరెంట్ బిల్లులు పెరిగాయనే సాకు చూపి పథకాలతో పాటు రేషన్ కార్డులు కూడా ఎత్తేస్తున్నారని, ఇంతటి దౌర్భాగ్యకరమైన ప్రభుత్వాన్ని తాము చరిత్రలో చూడలేదని పలువురు మహిళలు వాపోయారు. ఇలాంటి అనేక సమస్యలను సావధానంగా విన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. రానున్నది తమ ప్రభుత్వమేనని, పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, పేద, మద్య తరగతి ప్రజలు మెచ్చేలా పవనన్న పాలన ఉంటుందని, ఆ దిశగా తమను ఆశీర్వదించాలని ప్రజలను కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.