– ఐదో రోజు పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద బోరుమన్న వృద్ధురాలు
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట ఐదో రోజుకు చేరింది. మైపాడు రోడ్డు మధురా నగర్ లో ప్రతి ఇంటికి వెళ్లిన కేతంరెడ్డి ప్రతి ఒక్కరి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాటలో తనకు ఎదురైన సంఘటన ఎంతో బాధ కల్గించిందని అన్నారు. మధురా నగర్ లోని మొదటి వీధిలో ఉంటున్న ఓ వృద్ధురాలు వైసీపీ ప్రభుత్వం తన వృద్ధ్యాప్య పింఛన్ ఎత్తేసిందని, దీంతో బ్రతకడం కష్టంగా మారిందని వాపోయిందన్నారు. తన కొడుకు ఆటో కొనడానికి అప్పు కోసం ఆదాయ పన్ను దాఖలు చేసాడని, ఇప్పుడు పన్ను దాఖలు చేసారు అనే దాని ఆధారంగా తన రేషన్ కార్డు ఎత్తేశారని, పింఛన్ ఆగిపోయిందని, అండగా ఉండాల్సిన కొడుకు ఆర్ధిక ఇబ్బందులతో తనను వదిలేసి వేరుగా పోయాడని, ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని, తన రేషన్ కార్డులో తన కొడుకు కుటుంబ వివరాలను తొలగించి తనకు పింఛన్ పునరుద్ధరించాలని వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవట్లేదని భోరున విలపించిందన్నారు. గతంలో వయసును బట్టి వృద్ధులకు, స్థితిని బట్టి వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేవారని, ఇప్పుడు రేషన్ కార్డు ఆధారంగా ఇస్తుంటే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఏ ఇంటిలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయో, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుందని, అది వ్యక్తిగతమని, ప్రభుత్వం లబ్ధిదారులను తగ్గించుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఇలాంటి తుగ్లక్ పనులన్నింటికీ చరమగీతం పాడుతామని, లబ్ధిదారులందరికీ పింఛన్లు అందేలా చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.