Search
Close this search box.
Search
Close this search box.

సీబీఐ కోర్టు అనుమతితో దావోస్ వెళ్ళే దత్తపుత్రుడు కూడా నీతులు చెబుతున్నాడు : తూర్పుగోదావరి జనసేన నాయకులు

• జగన్ రెడ్డి సీబీఐ దత్తపుత్రుడు అనడానికి ప్రజలందరి దగ్గర ఆధారాలున్నాయి
• చేసిన అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు
• సీబీఐ దత్తపుత్రుడి బినామీ కంపెనీ చేతికి ఇసుక తవ్వకాలు
• జేపీ వెంచర్స్ స్థానంలో ‘టర్న్ కీ’ ఎందుకొచ్చిందో ప్రజలకు చెప్పాలి
• పవన్ కళ్యాణ్ గారిపై నోరు పారేసుకొంటే జగన్ చరిత్ర శివశివాని పబ్లిక్ స్కూల్ నుంచి బెంగళూరు ప్యాలెస్ వరకూ చెబుతాం
• కాకినాడలో మీడియా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలు

     తూర్పుగోదావరి, (జనస్వరం) : జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ప్రజల నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి, సంక్షేమం ఉంటే మనసులోంచి వివరాలు వచ్చేవని… పేపర్లు చూసి చదవాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకు రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని ఉత్తుత్తి పుత్రుడని పిలుస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనడానికి మీ దగ్గర సాక్ష్యాలు లేవనీ, మిమ్మల్ని జైలు పక్షి, సీబీఐ దత్తపుత్రుడు అనడానికి మాత్రం రాష్ట్ర ప్రజలందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆ సాక్ష్యాలతో మిమ్మల్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు పొందారన్నారు. శనివారం మధ్యాహ్నం కాకినాడలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణలతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల ఇంచార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ “ఏ ముఖ్యమంత్రి అయినా జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ఆ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతారు. మన ముఖ్యమంత్రి గారు మాత్రం పనికట్టుకుని రాజకీయ విమర్శలు చేసేందుకే జిల్లాల పర్యటనలు పెట్టుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడానికి వెచ్చించారు. వేట విరామ సమయంలో మత్స్యకారులకు నిరుద్యోగ భృతి మాదిరి వేట విరామ భృతి ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగానే వస్తుంది. ఏ ప్రభుత్వం అయినా దాన్ని చేపట్టాల్సిందే. అదేదో ఆయనే కనిపెట్టిన కార్యక్రమంలా చెప్పుకొంటున్నారు. మైదాన ప్రాంత చెరువులు, కుంటల్లో చేపలు పట్టుకునే మత్స్యకారుల జీవితాలను నాశనం చేసే జీవో 217 గురించి ఒక్క మాటైనా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఈ చీకటి జీవో మీద ఊరూవాడా ఉద్యమాలు జరుగుతుంటే పెదవి విప్పలేని పరిస్థితి.
• జిల్లాకు నాయకర్ పేరు ఎందుకు పెట్టలేదు?
  మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి గారు అదే మత్స్యకార సంఘాలు, వెనుకబడిన తరగతుల డిమాండ్ మేరకు జిల్లాకు ఆయన పేరు ఎందుకు పెట్టలేదు. ఆ విషయంలో వారి విన్నపాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టమంటే ఎందుకు స్పందించలేదో కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఉద్యోగులకు 13వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని దుస్థితి. ఈ పరిస్థితి రాష్ట్రంలో గతంలో ఎన్నడైనా ఉందా? విద్యుత్ ఉద్యోగులు జీతాల కోసం రోడ్డ మీదకు వస్తున్నారంటే ఎంత అసమర్ధ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లోనూ ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు తవ్వకాల బాధ్యత అప్పగిస్తే ఇప్పుడు టర్న్ కీ ఎక్కడి నుంచి వచ్చింది. ఇసుక అమ్మకం రసీదులు రాసి ఇస్తున్నారు. ఎందుకు డిజిటల్ పేమెంట్స్ అనుమతించడంలేదు. ఎందుకు ఆన్లైన్ బిల్లులు ఇవ్వడం లేదు. తమిళనాడుకు చెందిన వారే రీచుల్లో పని చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికీ టర్న్ కి సంబంధం ఏంటి? గతంలో శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా వీరి కార్యకలాపాలకు మొత్తం చెన్నై కేంద్రంగా ఉండేది. ఇప్పుడు అదే చెన్నైకి చెందిన మీ బినామీ సంస్థతో ఇసుక అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు అంతా శ్రీ జగన్ రెడ్డి బినామీ కంపెనీ మాయాజాలం. ఆ ఖాతాలోకి ఈ నగదు మొత్తం జమ అవుతుందని ప్రజలందరికీ అర్ధం అయిపోయింది. రాష్ట్రంలో పరిపాలన చూసి పక్క రాష్ట్రాల వారు నవ్వుకుంటుంటే సమాధానం చెప్పలేని మీరు కౌలు రైతులకు అండగా నిలచిన  పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతారా? మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటున్నారు.. మీ దగ్గర ఆయన దత్తపుత్రుడనడానికి సాక్ష్యాలు లేవు. మీరు జైలు పక్షి అనడానికి, సీబీఐ దత్తపుత్రుడు అనడానికి రాష్ట్ర ప్రజలందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని శిక్షించేందుకు వారంతా సిద్ధంగా ఉన్నాని అన్నారు.
• జగన్ రెడ్డి అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి :  పంతం నానాజీ
      పీఏసీ సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రోడ్లు, కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు చూస్తే జగన్ రెడ్డి దౌర్భాగ్యపాలన అర్థం అవుతుంది. పాలన ఎంత అస్థవ్యస్థంగా ఉందో గడపగడపకు వెళ్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుంది. పాలన చేతకాని ముఖ్యమంత్రి అన్న ముద్రను తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. మరోసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మీ గత చరిత్ర మొత్తం ఊరూరా వినిపిస్తాం. శివశివానీ స్కూల్ దగ్గర నుంచి మసాబ్ ట్యాంక్ దగ్గర ఇరానీ హోటల్లో బిల్లు కట్టకుండా దౌర్జన్యం చేయడం… బెంగళూరు ప్యాలెస్ వ్యవహారాలు.. చంచల్ గూడ జైల్లో షటిల్ ఆడుకోవడం అన్నీ ప్రజలకు చెబుతాం. అర్థరాత్రి ఆత్మలతో మీటింగులుపెట్టుకొని వాటితో మాట్లాడే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో దావోస్ సమావేశాలకు వెళ్ళాలి అంటే సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందాల్సి రావడం రాష్ట్రానికి సిగ్గు చేటు. కోర్టు అనుమతితో తిరిగే సీబీఐ దత్త పుత్రుడు కూడా నీతులు చెబుతున్నాడు. 95 శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారు. మద్యపాన నిషేధం అన్నారు.. ఎక్కడ? బూమ్ బూమ్ బీర్లు, గోల్డెన్ ఆంధ్ర, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్ లాంటి విచిత్రమైన బ్రాండ్లతో నాటు సారాను సీసాల్లో నింపి అమ్మడమేనా మద్య నిషేధం అంటే. కాపుల సంక్షేమానికి ఇస్తామన్న రూ.2 వేల కోట్లు ఎక్కడ. జనవరి 1న విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏది? సీపీఎస్ రద్దు ఎక్కడ? వీటన్నింటికీ సీబీఐ దత్తపుత్రుడు బదులు చెప్పాలి.
• ఇదేనా మత్స్యకారుల మీద ప్రేమ
     రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న ముఖ్యమంత్రిలో చలనం లేదు. పవన్ కళ్యాణ్ గారి భరోసా యాత్ర చూసి భయాందోళన మొదలయ్యింది. మత్స్యకారులకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలు మత్స్యకార గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారు దానం చేసిన ఆస్తుల్ని వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారు. ఏకంగా వైసీపీ జిల్లా కార్యాలయం కోసం ఆ భూములు వాడుతున్నారు. కొప్పనాతి కిష్టమ్మ చేయించిన అంతర్వేది నరసింహస్వామి రథాన్ని దగ్గం చేస్తే నేరం ఎవరు చేశారో ఇప్పటికీ తెలియదు. ఇదేనా మత్స్యకారుల మీద ప్రేమ” అని నిలదీశారు.
• రెండేళ్లలో లక్ష మంది లబ్దిదారులకు అన్యాయం: ముత్తా శశిధర్
     పీఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్ మాట్లాడుతూ “సీబీఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి మత్స్యకార భరోసా సభలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మత్స్యకార భరోసా కార్యక్రమంలో గడచిన రెండేళ్లలో లక్ష మంది అర్హులైన లబ్దిదారులకు అన్యాయం జరిగింది. డీజల్ సబ్సిడీలో కూడా మత్య్సకారులకు నష్టమే జరుగుతోంది. ఆయన అధికారంలోకి వచ్చాక అమాంతం పెరిగిన డీజిల్ ధరల గురించి మాట్లాడరు. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు ఇస్తామన్న రూ. 10 లక్షల పరిహారం ఎగ్గొట్టారు. మత్స్యకారుల సంక్షేమం అంటే ఇదేనా” అని ప్రశ్నించారు.
• బాదుడే బాదుడు కూడా గడప గడపకు తీసుకెళ్లాలి : పితాని బాలకృష్ణ
    పి.ఏ.సి. సభ్యులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ “తుపాను తర్వాత జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫుర రైతుకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పలేదు. కనీసం పంట నష్టం ఎంత జరిగిందో కూడా చెప్పలేదు. మ్యానిఫెస్టోలో 95 శాతం హామీలు అమలు చేశామని ఇంటింటికీ తిరిగి డబ్బాలు కొట్టమని మాత్రం శెలవిచ్చారు. అదే ఎమ్మెల్యేలతో మీరు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్లమని చెప్పండి. ముమ్మిడివరం నియోజకవర్గంలో రెండు బ్రిడ్జిలు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. పనులు మాత్రం ప్రారంభం కూడా కాలేదు. ఈ ప్రభుత్వ అభివృద్ధి పనులు పేపర్లలో ప్రకటనలకే పరిమితం” అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ నేతలు మేడా గురుదత్ ప్రసాద్, శెట్టిబత్తుల రాజబాబు, సంగిశెట్టి అశోక్, శ్రీ తుమ్మల రామస్వామి, పోలిశెట్టి చంద్రశేఖర్, వై.శ్రీనివాస్, వాసిరెడ్డి శివప్రసాద్, తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way