● మే 17 నుండి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు తెలుపుతాము
●పవన్ కళ్యాణ్ ను ఎందుకు ముఖ్యమంత్రిగా చేసుకోవాలో తెలుపుతాము
●”పవనన్న ప్రజాబాట” కరపత్రాన్ని విడుదల చేసి వివరాలు తెలిపిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : జనసేన పార్టీనాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక డి.ఆర్.ఉత్తమ హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈ నెల 17 నుండి కేతంరెడ్డి వినోద్ రెడ్డి చేపట్టబోయే పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని జిల్లాలోని పార్టీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, నెల్లూరు సిటీ నాయకులు, వీర మహిళలు, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా పుట్టి సామాన్య మధ్య తరగతి నేపథ్యం కల్గిన తాను చదువుకునే రోజుల నుండి రాజకీయాలపై ఆసక్తితో విద్యార్థి దశ నుండే ప్రజా పోరాటాల్లో భాగమయ్యానని అన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్త స్థాయి నుండి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు పని చేసే అవకాశం తనకు లభించిందని గుర్తు చేసారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి బయటికొచ్చిన తాను సేవ్ నెల్లూరు పేరుతో పన్నుల పోటుపై ప్రజా పోరుబాట నిర్వహించి నెల్లూరు నగర ప్రజలకు అండగా నిలవడం జరిగిందన్నారు. ఆ పోరాట పటిమను గుర్తించే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన నుండి ఏమీ ఆశించకుండా నిజాయతీగా, నిస్వార్ధంతో ఒక సామాన్యుడైన తనకు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారని అన్నారు. బీఫారం ఇచ్చే సమయంలో ఎంతో నమ్మకంతో సీటు ఇస్తున్నాను వినోద్, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకంటూ పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తుచేశారు. తనపై ఎంతో నమ్మకం ఉంచిన పవన్ కళ్యాణ్ గారి ఋణం తీర్చుకోలేనిదని అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత జరిగిన సమీక్షలో సైతం రాష్ట్రంలో ఎక్కువుగా డబ్బు ప్రవహించిన నియోజకవర్గాలు ఒకటి నాది అయితే రెండోది నీది అని తనతో పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తు చేశారు. అంతటి డబ్బు ప్రవాహంలో కూడా తనకు ఐదున్నర వేలకు పైగా ఓట్లు వచ్చాయంటే ఆనాడు పడిన ప్రతి ఓటు పవన్ కళ్యాణ్ గారికే అని అన్నారు. 2019 ఎన్నికలు అయిన నాటి నుండి ఈ మూడేళ్ళలో పార్టీలో తనకు పూర్తి స్వేఛ్ఛని ఇచ్చారని, పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని, అనేక సందర్భాల్లో ప్రజలకు అండగా నిలబడ్డామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు నెల్లూరుకు వచ్చిన సందర్భంలో “వినోద్.. పోరాడుతాడు.. ప్రశ్నిస్తాడు.. నిలబడాలి ఇలాంటోళ్ళు” అని తనని ఉద్దేశించి అన్నారని, ఎంతో నీతి నిజాయితీ కల్గిన నాయకుని మనసుకు నచ్చేలా ప్రజా సమస్యలపై పోరాడటం గర్వంగా ఉందని తెలిపారు. ఆ పోరాట స్ఫూర్తితోనే ఈ నెల 17న నెల్లూరు సిటీ 3వ డివిజన్ నుండి పవనన్న ప్రజాబాట పేరుతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సమస్యల అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు తెలిపి పవన్ కళ్యాణ్ ను ఎందుకు ముఖ్యమంత్రిగా చేసుకోవాలో తెలుపుతామన్నారు. మూడేళ్ళ వైసిపీ పాలనలో నెల్లూరు సిటీలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, కోవిడ్ సమయంలో వ్యాపారస్తులపై బెదిరింపులు, ప్రభుత్వ ఉద్యోగులను, కార్మికులను మోసగించిన వైనం గుర్తుచేస్తామన్నారు. మూడేళ్ళు మంత్రిగా ఉండి కూడా నెల్లూరు సిటీలో ప్రజలకు గుర్తుండేలా కనీసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏ ముఖం పెట్టుకుని గడప గడపకు తిరుగుతారని, పవనన్న ప్రజాబాటతో ఆ గడప గడప దగ్గరే అనిల్ అసమర్ధత తెలియజేస్తామని ఎద్దేవా చేసారు. జిల్లాలో కొందరు అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, ప్రతి ఒక్కరి పేరుని వ్రాసుకుంటున్నామని, 2024లో సీఎం అయ్యేది పవన్ కళ్యాణే అని, అధికారంలోకి రాబోయేది తామేనని, ఏ ఒక్క అధికారిని కూడా ఊరికే వదిలిపెట్టమని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట ఇన్ ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, జిల్లా నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, ఏటూరి రవి, కారంపూడి కృష్ణారెడ్డి, కాకు మురళీరెడ్డి, మేకల ప్రవీణ్ యాదవ్, ఆమంచర్ల శ్రీకాంత్, జీవన్, హేమంత్ రాయల్, జఫర్, కుక్క ప్రభాకర్, రేవంత్ వీరమహిళలు షేక్ ఆలియా, శిరీషారెడ్డి, సునంద, కుసుమ, ఝాన్సీ పార్టీ తరఫున పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.