● అసౌకర్యాల మధ్య వ్యాపారాలు
● నరకయాతన పడుతున్న వ్యాపారులు
● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
● జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ
కొత్తవలస, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లాలో మంచి వాణిజ్య ప్రాంతంగా గుర్తింపు పొందిన కొత్తవలస సంత మార్కెట్ ను తక్షణమే అభివృద్ధి చేయాలని జనసేన నాయకులు వబ్బిన సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసౌకర్యాల మధ్య నలిగిపోతున్న వ్యాపారులకు స్వాంతన చేకూర్చాలి. పరిసర మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు ఈ సంత మార్కెట్ పై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రతి మంగళవారం లక్షల్లో వ్యాపారం సాగుతోంది. కూరగాయల నుంచి కోళ్ల వరకు ఎంతోమంది ఈ సంతపై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. ఎంతో విశిష్టత ఉన్న సంత మార్కెట్ లో అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. కనీస సౌకర్యాలు కూడా కనిపించడం లేదు. బురద, అపరిశుభ్రత మధ్యే వ్యాపారాలు సాగుతున్నాయి. వర్షం పడిందంటే మురుగునీరు ముచ్చెత్తుతోంది. పూర్తిస్థాయిలో షెడ్డులు లేకపోవడంతో ఎండల్లోనే వ్యాపారాలు కొనసాగించాల్సి వస్తోందని అన్నారు. పారిశుద్ధ్యం కూడా అధ్వాన్నంగా ఉంటోంది. సరుకు నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు, రైతులకు విశ్రాంతి కేంద్రాలు కూడా లేవు. మంచినీటి సౌకర్యం కూడా అంతంత మాత్రమేనని వాపోయారు. వెంటనే కొత్తవలస సంత మార్కెట్ అభివృద్ధికి తోడ్పడాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.