అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం రూరల్ మండలంలోని కందుకూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఘనంగా అంబేద్కర్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ” అంబేద్కర్ యువత – కందుకూరు ” ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభం చేశారు. అనంతరం అంబేద్కర్ ఫోటోకు పూలదండను వేసి నివాళులు అర్పించారు. ఎస్సై శ్రీకాంత్ గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఆశయ సాధన కోసం నిరంతర కృషీవలుడు డా. బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ లాంటి మహనీయుల భావజాలం, ఆశయాలను ప్రతీ పౌరుడు మార్గదర్శకంగా తీసుకుని నవసమాజ, సమసమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి ఆశయ సాధనకోసం ప్రతి ఒక్క యువత కృషి చేయాలని కోరారు. భారత దేశంలో వెనుకబడిన వర్గాల్లోని ప్రజలకు కనీస హక్కులు, సామాజిక హోదా కల్పించడానికి విశేష కృషి చేశారు. సామాజిక స్థితి మరింత బాగుపడాల్సిన అవసరం ఉన్నా, అనాదిగా దళిత ప్రజలపై సాగుతున్న అరాచకాన్ని తెరపైకి తీసుకొచ్చి కనీసం చట్టం దృష్టిలో వారికి సమానత్వాన్ని కల్పించగలిగారు. మేథస్సు వంశపారంపర్యంగానే రానక్కరలేదని చెప్పడానికి అతను ఒక గొప్ప ఉదాహరణ.” అని అన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచడం కాదు. సాటి మనుషుల పట్ల గౌరవ, పూజ్య భావం కలిగి ఉండడమే అసలైన ప్రజాస్వామ్యం” అని చెప్పిన కరుణాహృదయుడు, గొప్ప దార్శినికుడని అన్నారు. అంబేద్కర్ కలగన్న సామాజిక ప్రజాస్వామ్యం సాధించడంలో మనం ఇంకా సఫలం కాలేదని, అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం, కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని గుర్తూ చేస్తూ, యువత అంతా కలసి అంబేద్కర్ కలలుగన్న సమాజం వైపు శ్రమించాలని కోరారు. అలాగే చట్టాలపై అవగాహన కల్పిస్తూ రిట్ల గురించి తెలియజేశారు. ఆ రిట్లు సామాన్య ప్రజలకు ఏ విధంగా సహకరిస్తాయో వివరిస్తూ ” జై భీమ్ ” సినిమా గురించి వివరించారు. పోలీసు వ్యవస్థ తప్పు చేస్తే కోర్టు శిక్షలు, సామాన్యుడికి చట్టాలు, తన హక్కుల గురించి ఈ సినిమా తెలియజేస్తుందని తెలిపి ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. సాయంత్రం అంబేద్కర్ గారి ఫోటోతో గ్రామం మొత్తం ఊరేగింపు చేశారు. అంబేద్కర్ గారి ఆశయాలను, సిద్దాంతాలను అందరికీ తెలియజేసేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. ప్రశాంత్, ఎంపిటిసి పెద్దప్పయ్య, అంబేద్కర్ యువత, గ్రామ పోలీసు ఇంచార్జ్ గౌస్, తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.