జి డి నెల్లూరు, (జనస్వరం) : జగన్ కాళ్ళు మొక్కి మంత్రి పదవి తెచ్చుకున్న జి డి నెల్లూరు ఎమ్మెల్యే కె నారాయణస్వామి నియోజకవర్గంలోని రెండు మండలాలను తిరుపతిలో ఎందుకు కలపలేకపోయారని నియోజకవర్గం జనసేన ఇంఛార్జి పొన్నా యుగంధర్ నిలదీశారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో నారాయణస్వామికి తాను, తన కుటుంబం అంటే స్వార్దం తప్పా! ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న చిత్త శుద్ధి లేదని విమర్శించారు. నియోజక వర్గంలోని కార్వేటినగరం వెదురుకుప్పం మండలాలను తిరుపతిలో చేర్చాలని ప్రజలు నెత్తీ నోరు కొట్టుకుంటున్నా స్వామి పట్టించుకోలేదన్నారు. ఎస్ అర్ పురం, పాలసముద్రం మండలాలను చిత్తూరులో ఉంచడంలో ఆయన విఫలమయ్యారని చెప్పారు. దీంతో నాలుగు మండలాలను నగరి రెవెన్యూ డివిజన్లో కలిపారని విమర్శించారు. మంత్రి పదవి కోసం ప్రాధేయపడిన విధంగానే మండలాల కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదని నిలదీశారు. ఉప ముఖ్య మంత్రి హోదా అనుభవిస్తూ మూడేళ్ల పాటు తన స్వార్థప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ప్రజల అభివృద్ధి గూర్చి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడైనా మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వెదురుకుప్పం, పెనుమూరు, పాలసముద్రం మండలాలలో రెవెన్యూ సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ వేసి దేశానికి వెన్నుముక అయిన రైతులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను బాలాజీ జిల్లాలో కలిపే వరకు జనసేనపార్టీ తరపున పోరాటం ఆగదని తెలిపారు.