గుంటూరు, (జనస్వరం) : శతాబ్దం క్రితమే అంటరానితన నిర్మూలన కోసం, కుల అస్పృశ్యత నిర్మూలన కోసం, సామాజిక న్యాయం కోసం, స్త్రీ విద్య కోసం తన జీవిత పర్యంతం కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జ్యోతిరావు పూలే 195 పుట్టినరోజు సందర్భంగా సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధి కోసం, ఆడపిల్లల చదువు కోసం ఆయన చేసిన కృషిని ప్రతీఒక్కరూ తేలుసుకోవాలనీ, అందుకోసం జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను అందరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. లోకకల్యాణం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని, కేవలం జయంతి, వర్ధంతి నివాళులు అర్పించటమే కాకుండా వారు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. జ్యోతిరావు పూలే స్పూర్తితో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కుల వ్యవస్థ మీద, సామాజిక న్యాయం మీద ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, కార్యదర్శి నక్కల వంశీ, దళిత నాయకులు కొండూరు కిషోర్, నాయకులు అన్నదాసు సుబ్బారావు, తుమ్మల నరసింహ, సుధా నాగరాజు, కొనిదేటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.