తూర్పుగోదావరి ( జనస్వరం ) : జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ క్షణాన ఏ పన్ను వేస్తుందో.. ఏ ఛార్జీలు పెంచుతుందో తెలియక పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. జగన్ రెడ్డి గారి ఫ్యాను గుర్తు చూసి ఓటేసిన వారూ ఈ రోజు ఇంట్లో ఫ్యాను వేయాలంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో వెనక్కి తగ్గే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. శుక్రవారం ఉదయం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, నియోజకవర్గాల ఇంఛార్జులతో కలసి పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం డీఈవో శ్రీ సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “యువకుడయిన జగన్ రెడ్డి చక్కటి పరిపాలన అందిస్తారని రాష్ట్ర ప్రజలు భావించారు. గతంలో మీరు బాదుడే బాదుడు అంటూ పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ తిరిగారు. ఈ రోజు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసిన ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగకుండా చేశారు. ఫ్యాన్ ఆన్ చేయాలంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భయం వేస్తోంది. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ఇలాంటి విచిత్రమైన పరిపాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం పాలన దక్షత లేని వ్యక్తి అని అర్ధం అవుతోంది. గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా పేద ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటికి సగటున విద్యుత్ ఛార్జీ రూ. 500 పెంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజా సమస్యల మీద గళం విప్పి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం చేస్తాం అన్నారు.
• భారీ నిరసన ప్రదర్శన.. రోడ్డుపై బైఠాయింపు
అంతకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉదయం గంట 10. 30 నిమిషాల సమయంలో శ్రీ మనోహర్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు, నియోజకవర్గాల ఇంఛార్జులతో కలసి స్థానిక జెడ్పీ సెంటర్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో చేసుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నినదిస్తూ జెడ్పీ సెంటర్ నుంచి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, బాబు జగజ్జీవన్ రామ్ బొమ్మ మీదుగా ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కలెక్టరు కార్యాలయం వైపు వెళ్తుంటే పోలీసులు ఆంక్షలు తెలిపారు. ధర్నా చౌక్ వద్ద రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా కలెక్టర్ గారి కార్యాలయానికి చేరుకున్నారు. ధర్నా సందర్భంగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాలన్నీ జనసేన శ్రేణులు ఇచ్చిన నినాదాలతో మారుమోగాయి. ఆ ప్రాంతం జనసేన జెండాలతో నిండిపోయింది. బాదుడే.. బాదుడు.. మూడేళ్ల పాలనలో ఏడు సార్లు పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి.. కరెంటు కోత ఛార్జీల మోత.. పేద మధ్యతరగతి ఆర్తనాధాలు –అంధకారంలో రాష్ట్రం.. అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్ పరిసరాలన్నీ జనసేన శ్రేణుల నినాదాలతో మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ నాయకులు శ్రీ మేడా గురుదత్ ప్రసాద్, శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ, శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్, శ్రీ బండారు శ్రీనివాస్, శ్రీ వరుపుల తమ్మయ్య బాబు, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ తుమ్మల రామస్వామి, శ్రీ అత్తి సత్యనారాయణ, శ్రీమతి మాకినీడి శేషుకుమారి, శ్రీ వై.శ్రీనివాస్, శ్రీమతి గంటా స్వరూప, శ్రీమతి పోలాసపల్లి సరోజ, శ్రీ వాసిరెడ్డి శివ, శ్రీ తలాటం సత్య, శ్రీమతి చల్లా లక్ష్మి, శ్రీమతి కడలి ఈశ్వరి, శ్రీమతి ముత్యాల జయలక్ష్మి, పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…