పిఠాపురం, (జనస్వరం) : భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురూ ముగ్గురే. విప్లవ యోధాగ్రేసరులే! ఉరి కంబాన్ని ఓ క్రీడాస్థలిగా ఎన్నుకొని, విప్లవ ఒయ్యారపు సోయగపు కసరత్తులను ప్రదర్శించిన సాటి లేని మేటి క్రీడాకారులే! లాహోర్ కేంద్ర కారాగారంలో విప్లవ పులకాంకితులై సయ్యటాలు ఆడినవాళ్లే! ఉరి కంభం నుండి వేలాడుతోన్న ఉరిత్రాడును తమ చేతితో మెడచుట్టూ బిగించుకుంటూ “ఇంక్విలాబ్ జిందాబాద్” అని గొంతెత్తి ప్రతిధ్వనించిన వాళ్లే. గొంతులో ఆఖరి శ్వాస విడిచేంత వరకూ “సామ్రాజ్యవాదం నశించాలి” అని కసికొద్దీ నినదించిన వాళ్లే! ప్రపంచ పెట్టుబడిదారీ దుష్ట వ్యవస్థపై ఎగరేసిన సిద్ధాంత, రాజకీయ బావుటాకు ప్రతీకగా “ప్రపంచ శ్రామికులారా ఏకం కండు” అని గొంతెత్తి గర్జిస్తూ భౌతికంగా ఆఖరి శ్వాస విడిచే వరకూ నినదించిన మహోన్నత త్యాగ ధనులు ఆ వీర, ధీర, విప్లవ యోధులు! భారత స్వాతంత్ర విప్లవకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఆ ముగ్గురు విప్లవానికి నిలువుటద్దంగా నిలిచారు. బ్రిటిష్ దుర్మార్గపు పాలనలో చిక్కుకున్న భారత దేశానికి విముక్తి కలిగించేలా.. దేశ ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని నింపి..భారత స్వాతంత్ర్యోద్యమాన్ని మరో మెట్టు ఎక్కించారు.వాళ్ళు చావుకు వెరవలేదు. మృత్యువును ముద్దాడారు. మరణాన్ని జయించారు. ఈ భూమి మీద ధనిక స్వామ్య వ్యవస్థ జీవించినంత కాలం వాళ్ళు దానిపై యుద్ధదగ్ధ ప్రతీకలై వర్ధిల్లుతారు. అది దగ్ధమయ్యాక, వాళ్ళు అమర ప్రతీకలై విరాజిల్లుతారు. శ్రమ దోపిడీ వ్యవస్థ మనుగడలో ఉన్నంత కాలం వాళ్ళు అమర సందేశాలై వర్ధిల్లుతారు. దోపిడీ, పీడన, అణచివేత, కష్టాలు, కన్నీళ్లు లేని సమసమాజం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు అమర సంకేతాలై వెలుగొందుతారు. ఇప్పుడు భగతసింగ్, రాజగురు, సుఖదేవ్ లకు మనం రాజకీయ పునర్జన్మ కలిగిద్దాం. అట్టి సమయం సమీపించింది. ఇప్పటి వరకు ఒక ఎత్తు. నేడు మరో ఎత్తు! గత చరిత్ర వర్తమాన చరిత్రకు ఉద్యమ ఉద్దీపన కలిగిస్తే, భవిష్యత్తు చరిత్ర నిర్మాణానికి వర్తమాన చరిత్ర వెలుగులు వెదజల్లే దారిదీపాల్ని అందిస్తుంది. అట్టి దారి దీపాల్ని గత చరిత్ర మట్టి పొరల్ని త్రవ్వి వెలికితీసి, వెలుగులోకి తెచ్చి రాజకీయ పదును పెట్టుకుందాం.దోపిడీదారుల నుంచి సమాజాన్ని, రాష్ట్రాన్నీ రక్షించుకున్నప్పుడే ఆ అమరుల త్యాగాలకు సార్థకత. ఆ దేశభక్తుల సాహసాలను స్మరించుకుంటూ వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు పునరంకితం అయ్యి వారి స్మృతికి నివాళులర్పిద్దాం.