అమరావతి, (జనస్వరం) : సుమారు 35 వేల ఎకరాలను భూములను రాజధాని నిర్మాణం కోసం అందించిన రైతులు 811 రోజులుగా చేస్తున్న పోరాటం వజ్ర సంకల్పంతో కూడుకున్నది. రాజధాని కోసం అనే నిర్దుష్ట ప్రయోజనంతో తాము సాగు చేసుకొంటున్న భూములను సమీకరణలో త్యాగం చేశారు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టి వేస్తూ ఇచ్చిన తీర్పులోని అంశాలు అమలయ్యే వరకూ పోరు ఆగదని రైతులు చేస్తున్న దీక్షలు సంకల్ప బలంతో కూడుకున్నవి.
ప్రజాస్వామ్య విధానంలో.. గాంధేయ మార్గంలో తాము చేస్తున్న సంగ్రామం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడంతోపాటు రాజధాని అమరావతిని నిర్మింపచేసుకోవాలనే చిత్తశుద్ధి ఉంది. రాజధాని వికేంద్రీకరణ పేరుతో ఈ ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలు, చర్యలను నిరసిస్తూ రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు చేస్తున్న పోరాటంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలు, కేసులను తట్టుకొని నిలబడ్డారు. ఆ సహనమే వారికి శ్రీరామరక్ష అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.
హైకోర్టు తీర్పు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఇతర మార్గాలు వెదుకుతుంది అనే భావన రైతుల్లో ఉంది. అంటే రాజధాని రైతాంగంలో దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయినట్లే. హైకోర్టు తీర్పును గౌరవిస్తూ నిర్దుష్ట కాలపరిమితిలో రాజధాని నిర్మాణం కోసం, అదే విధంగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి. అమరావతి నిర్మాణం అయ్యేవరకూ పోరాడాలనే లక్ష్యంతో ఉన్న రైతుల వెన్నంటి జనసేన ఉంటుంది.