హైదరాబాద్, (జనస్వరం) : జనసేనపార్టీ బలోపేతం కావాలంటే ఒక్కో డివిజన్ లో కనీసం వంద మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి.. అప్పుడు కచ్చితంగా మన పార్టీ ప్రభావం రాజకీయంగా కనిపిస్తుంది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అటువంటి బలమైన క్రియాశీలక సభ్యులతో బృందం ఉంటే పోటీ చేసిన అభ్యర్థికి ఉండే ధైర్యం వేరన్నారు. ఒక్క ఫోన్ కాల్ తో వారంతా మనకోసం నిలబడడానికి వస్తారు అన్న నమ్మకం ఉంటేనే పోరాటం చేయగలుగుతామన్నారు. ఆదివారం ఉదయం తెలంగాణలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమంపై హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు శ్రీ రామ్ తాళ్ళూరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యులు మన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తారు. క్రియాశీలక సభ్యులకు పార్టీ అండగా నిలిచి భరోసా ఇచ్చేందుకే శ్రీ పవన్ కల్యాణ్ గారు బీమా సదుపాయాన్ని తీసుకువచ్చారు. దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు రూ. 5 లక్షల రూపాయిలు ఇచ్చి ఆ సభ్యుడి కుటుంబానికి ఏ విధంగా భరోసా ఇవ్వగలిగామో అంతా చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 38 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున స్వయంగా వెళ్లి ఆ మొత్తాన్ని అందించాం. జిల్లా నాయకత్వం మొత్తం కలసి ఇంటికి వెళ్లి ఆ భరోసా నింపినప్పుడు ఆపదలో అండగా నిలిచామన్న ధైర్యం వారిలో కలిగింది. చెక్కులు ఇచ్చిన వారిలో 36 చిన్న చిన్న కుటుంబాలే. రోజువారీ పనులు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చినవారే. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నారన్న నమ్మకాన్ని కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కల్పించాలి. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునే ప్రతి క్రియాశీలక సభ్యుడికీ ప్రత్యక గౌరవం ఇవ్వడంతో పాటు ప్రతి జిల్లాలో రాజకీయంగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా నాయకులు, బాధ్యులు చురుగ్గా పాల్గొని క్రియాశీలక సభ్యత్వాలను చేయాలి. ఈ సభ్యుల ద్వారా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ప్రజలకు చేరువ కావచ్చు. మొదటి విడత 98 వేల సభ్యత్వాలు చేసినప్పుడు చాలా మంది బీమా గడువు నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మార్చి వరకు గడువు పెంచేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మిగిలిన మొత్తాన్ని చెల్లించారు. గతంలోనూ క్రియాశీలక సభ్యుల కోసం రూ. కోటి విరాళం అందించారు. 14వ తేదీన నిర్వహించే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ నుంచి కూడా అంతా కలసి వచ్చి సత్తా చాటాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ రాధారం రాజలింగం, శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్, శ్రీ సంపత్ నాయక్, శ్రీమతి మండపాక కావ్య, శ్రీ దుంపటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.