రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి విశ్వబ్రాహ్మణుల తరఫున వినతి పత్రం అందజేసిన రాజోలు జనసేన పార్టీ ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి, చినబాబు గారు.అనాదిగా చేతి వృత్తులపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణులు కార్పొరేట్ వ్యవస్థల రాకతో జీవనోపాధి కోల్పోయారని వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా చేదోడు పథకం లో అవకాశం కల్పించాలని కోరడంతో పాటు విశ్వబ్రాహ్మణుల సమస్యలన్నిటినీ కూడా మనోహర్ గారికి వివరించి చెప్పారు. న్యాయబద్ధమైన విశ్వబ్రాహ్మణుల సమస్యలను అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేకూరేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని మనోహర్ గారు హామీ ఇచ్చారు. విశ్వబ్రాహ్మణులు కులవృత్తులు లేక ఆర్థిక ఇబ్బందులు గురించి వివరిస్తూ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు వివిధ వృత్తులలో 20 లక్షల మంది జనాభా కలిగి ఉన్నారు. వీరికి ప్రధానంగా సమాజంలో ఐదు (5) చేతివృత్తులు ఉన్నాయి. (1) కమ్మరం (2) వడ్రంగి (3) కంచరం (4) శిల్పం (5) స్వర్ణకార
1. కమ్మరం : గునపం, కత్తి, కొడవలి వంటి వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తారు.
2. వడ్రంగులు : కుర్చీలు, టేబుల్స్, మంచం, బీరువాలు, గుమ్మాలు, కిటికీలు తయారు చేయువారు.
3. కంచరం : బిందెలు, పళ్ళాలు, చెంబు, గ్లాసులు, దేవాలయాలలోని విగ్రహాలు, మకర తోరణాలు, ధ్వజస్తంభానికి తొడుగులు మొదలైనవి తయారు చేయువారు.
4. శిల్పులు : మీరు దేవాలయాలలోని రాతి కట్టడాలు, రాతి గోడలపై శిల్పాలు, గుడిలో పూజ విగ్రహాలు తయారు చేయువారు.
5. స్వర్ణకారులు : మాంగల్యం, చెవి దుద్దులు, ఉంగరాలు, గొలుసులు, నల్లపూసలు, వెండి సామాన్లు, పట్టీలు వగైరా తయారు చేయువారు.
ఈ ఐదు వృత్తుల వారు ప్రస్తుతం భారీ మిషనరీలు రావడం వలననూ, రెడీమేడ్ వస్తువులు తయారయ్యి పెద్ద షాపుల ద్వారా, మాల్స్ ద్వారా వ్యాపారం జరుగుట వలననూ చేతి వృత్తులు పూర్తిగా దెబ్బతిని, జీవనోపాధిని కోల్పోయి చాలా ఆర్థిక ఇబ్బందులు పడుచున్నారు.
కావున వెంటనే విశ్వబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి మమ్ములను ఆదుకోవాల్సిందిగా కోరుచున్నామన్నారు.
1. వివిధ చేతివృత్తుల వారికి (రజకులు, నాయీ బ్రాహ్మణులు) ఇస్తున్న చేదోడు పథకం లో విశ్వబ్రాహ్మణులను కూడా చేర్చి పేద విశ్వ బ్రాహ్మణ కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరారు.
2. మంగళ సూత్రాలు కేవలం స్వర్ణకారులచే చేయించే విధంగా జీ.వో (G.O) తీసుకు రావాల్సిందిగా కోరారు.
3. పాదయాత్ర సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారు విశ్వబ్రాహ్మణులకు ఎ.మ్మె.ల్సీ ఇస్తానని వాగ్దానం చేశారు. వారి పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ మాకు ఎ.మ్మె.ల్సీ ఇవ్వలేదు. కావున వెంటనే విశ్వబ్రాహ్మణులకు ఎ.మ్మె.ల్సీ ఇప్పించ వలసిందిగా కోరారు.
4. దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారుల పై అన్యాయంగా కేసులు మోపి విచక్షణారహితంగా హింసిస్తున్నారు. కావున ఇందుకు సంబంధించిన జీ.వో (G.O) లో మార్పులు తీసుకువచ్చి స్వర్ణకారులను చట్టపరంగా ఆదుకోవాల్సిందిగా కోరారు.
5. వడ్రంగి పని వారి పై ఫారెస్ట్ అధికారుల వేధింపులు లేకుండా ప్రత్యేక చట్టం తీసుకు రావాల్సిందిగా కోరారు.
6. రాజధానిలో విశ్వబ్రాహ్మణ భవన నిర్మాణానికి స్థలం కేటాయించి వలసిందిగా కోరారు.
7. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలలో విశ్వబ్రాహ్మణులకు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ గా అవకాశం కల్పించవలసిందిగా కోరారు.
8. రాష్ట్రంలో ప్రతి గ్రామ, పట్టణాల్లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయాల నిర్మాణానికి స్థలం కేటాయించి వలసిందిగా కోరారు.